Published : 27 Nov 2021 02:14 IST
క్రేన్ పైనుంచి పడి కార్మికుడు..
మనోహరాబాద్, న్యూస్టుడే: పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఎత్తు పైనుంచి పడి తీవ్ర గాయాలై కార్మికుడు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ మండలం కాళ్లకల్ పారిశ్రామికవాడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు.. కాళ్లకల్లోని ఓ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లాకు చెందిన శ్రీనివాస్ రామ్(42) కొన్నేళ్లుగా ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. భారీ క్రేన్ పైకి ఎక్కి శుభ్రం చేస్తుండగా కిందపడటంతో ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. తోటి సిబ్బంది క్షతగ్రాతుడిని చికిత్స నిమిత్తం పరిశ్రమలోని అంబులెన్సులో మేడ్చల్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆ రాష్ట్రం నుంచి కుటుంబీకులు వచ్చే వరకు మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరుస్తామని చెప్పారు.
Tags :