తీరుతున్న ఆకలి బాధలు!
అభాగ్యులకు దొరుకుతున్న దాతల అండ
ఈనాడు, సంగారెడ్డి: సదాశివపేట మండలం మద్దికుంటలోని మరో ముగ్గురు అభాగ్యులైన వృద్ధురాళ్లకు ఆరునెలలకు సరిపడా బియ్యం, ఇతర నిత్యావసరాలు సమకూరాయి. ఈ గ్రామంలోని ఈశ్వరమ్మ, గంగమ్మ, మణెమ్మల దుస్థితిని వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్న వారి బాధలను ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. ‘భర్తను కోల్పోయి.. ఆసరా అందక’ శీర్షికన ఈనెల 9న కథనాన్ని అందించింది. ఇప్పటికే ఆ ముగ్గురికి పలువురి దాతల నుంచి సాయం అందింది. విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరికెపూడి రఘు స్పందించి.. ఇలాంటి దయనీయ స్థితిలో జీవిస్తున్న మరో ముగ్గురికి ఆరునెలలకు కావాల్సిన సరకులను ఇచ్చారు. బాలమ్మ, సుశీల, నాగమ్మ అనే వృద్ధురాళ్లకు ఒక్కొక్కరికి క్వింటాలు బియ్యం, అయిదు లీటర్ల నూనె ఇతర వస్తువులు అందించారు. కుమారుడి ఆరోగ్యం బాగు చేయించలేక అవస్థలు పడుతున్న గంగమ్మకు ప్రతినెలా రూ.3వేల నగదు సాయం చేస్తామన్నారు. సుశీల కళ్లమంటలతో బాధపడుతున్న విషయాన్నీ గుర్తించారు. త్వరలోనే ఆమెకు పరీక్షలు చేయించి అవసరమైన చికిత్స అందేలా చూస్తామన్నారు.