logo
Published : 27 Nov 2021 02:14 IST

రాజ్యాంగ హక్కులు వినియోగించుకోవాలి


సదస్సులో మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళి సై

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: గిరిజన తెగలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించినా వాటిని సరిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉందని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి- పంచాయతీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్డీ-పీఆర్‌)లో నిర్వహించిన న్యాయవాదుల సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. గిరిజనులు పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధిలో వెనకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు న్యాయవ్యవస్థలో సరైన ప్రాతినిధ్యం లభించని పరిస్థితి ఉండటం బాధాకరమని అన్నారు. న్యాయవాదులు గిరిజనులకు న్యాయ సలహాలు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్‌ఐఆర్డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌, సెంటర్‌ ప్రాక్టీసింగ్‌ లా సంస్థ డైరెక్టర్‌ రాజేశ్వరి, న్యాయవాదులు పాల్గొన్నారు.

‘న్యాయ విజ్ఞానవేత్తలు’ పురస్కారాల ప్రదానం

నారాయణగూడ, న్యూస్‌టుడే: న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించడానికి న్యాయవాదులు సామాజిక కార్యకర్తలుగా పని చేయాలని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బొగ్గులకుంటలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో తెలంగాణ కౌన్సిల్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం భారతదేశానికి ఉందన్నారు. ఈ సందర్భంగా విశేష సేవలందిస్తున్న సీనియర్‌ న్యాయవాదులు డి.ఎల్‌.పాండుముదిరాజ్‌, ఎల్‌.హెచ్‌, రాజేశ్వరరావు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నంద, సాయికృష్ణ ఆజాద్‌, డా.సాల్మన్‌రాజ్‌, ఆలె నాగేశ్వరరావు, యు.వి.నాగలక్ష్మి, జి.విజయకుమారికి ‘న్యాయ విజ్ఞానవేత్తలు’ పురస్కారాలు ప్రదానం చేశారు.

హిమాయత్‌నగర్‌ న్యూస్‌టుడే: రాజ్యాంగ పీఠిక చదివినా కేసులు బనాయించే పరిస్థితులు నెలకొన్నాయని, ఇది విచారించదగిన పరిణామమని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ ప్రొ.మాడభూషి శ్రీధర్‌ పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో ‘రాజ్యాంగ పరిరక్షణ దినం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ఉద్యమం ఆరంభంలోనే ప్రధాని స్పందించి ఉంటే, ఏడొందల మంది ప్రాణాలు కాపాడేవారని అభిప్రాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీఎంపీ అజీజ్‌పాషా, పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, బాలమల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చర్చలు లేకుండా బిల్లుల ఆమోదం సరికాదు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దక్షిణ భారత న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.రాధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్టసభల్లో చర్చలు లేకుండా బిల్లుల ఆమోదం మంచి పరిణామం కాదని, ఇలా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి రద్దు చేయించుకున్నారని పేర్కొన్నారు. చట్ట సభలలో చర్చలు జరిగినప్పుడు వాటి ఫలాలు అందరికీ అందుతాయన్నారు.హైకోర్టు సీనియర్‌ కౌన్సిల్‌ ఎస్‌.నంద, ఎస్‌.నాగేందర్‌, ముంతాజ్‌ పాషా పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని