logo
Published : 27 Nov 2021 03:17 IST

అవగాహన కల్పిస్తున్నా.. ఆమడ దూరం!

కల్లాల నిర్మాణంలో ఇదీ అన్నదాతల తీరు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌. న్యూస్‌టుడే, తాండూరు


వికారాబాద్‌-మోమిన్‌పేట్‌ ప్రధాన రహదారిపై..

రైతుల ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రభుత్వం కల్లాలు నిర్మించుకునేందుకు ఉపాధి పథకంలో అవకాశం కల్పించింది. అన్నదాతలు ముందుకు వస్తే సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా, వివిధ కారణాలతో చాలా ప్రాంతాల్లో ఆసక్తి చూపడంలేదు. ఉత్పత్తులు చేతికొచ్చినపుడు నూర్పిడి చేసేందుకు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కొన్నిసార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులను పూర్తిగా అధిగమించేందుకు అధికారులు ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని అనుమతులిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా, పనుల ప్రగతిలో పురోగతి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా మూడు వేలకుపైగా కల్లాలు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారుగా పది శాతం మాత్రమే పూర్తయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

జిల్లాలో 2.25 లక్షల మంది రైతులు, 5.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఏటా పత్తి, కంది, మొక్కజొన్న, వరి, జొన్న, పెసర, మినుము తదితర పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు మూడు నెలల పాటు రహదారులపై పంటలు నూర్పిడి చేస్తున్నారు. కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట, యాలాల, బషీరాబాద్‌, దోమ తదితర మండలాల్లో ధాన్యాన్ని ప్రధాన రోడ్లపై ఆరబోస్తున్నారు. రోడ్డుపక్కనే బస్తాలను నిల్వ చేస్తున్నారు. వికారాబాద్‌, మోమిన్‌పేట, నవాబుపేట, మర్పల్లి, ధారూర్‌ తదితర మండలాల్లో కంది, జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను రోడ్లనే ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నచిన్న దెబ్బలతో బయటపడుతున్నారు.


కుల్కచర్ల మండలం బొర్రాహేమ్యానాయక్‌తండాలో తూర్పారబడుతున్న మహిళా రైతు

తొలుత బిల్లులు రాక వెనకడుగు..

రెండేళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో పంట కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఎప్పటికప్పుడు చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. రైతుల అవసరాలకు అనుగుణంగా మూడు రకాల విస్తీర్ణంలో వీటిని నిర్మించుకోవచ్ఛు ఒక్కో యూనిట్‌కు 50 చదరపు మీటర్ల నుంచి 75 చదరపు మీటర్లు ఉంటుంది. యూనిట్‌ విలువ రూ.57 వేలు, రూ.68 వేలు, రూ.85 వేలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వంద శాతం రాయితీ వర్తిస్తుంది. ఇతరులకు 80 శాతం రాయితీ, 20 శాతం రైతు తనవంతుగా డీడీ చెల్లించాల్సి ఉంటుంది. తొలినాళ్లలో కల్లం నిర్మించుకున్న వారికి బిల్లులు సత్వరం చెల్లించేవారు. దీంతో ఆసక్తి ఉన్నవారంతా నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నారు. అనంతరం చెల్లింపుల్లో జాప్యం జరగడంతో వెనుకడుగు వేశారు.

జిల్లాలో నిర్మాణాల లక్ష్యం.: 3,017

అనుమతులు తీసుకున్న రైతులు: 2,100

నిర్మాణాలు పూర్తయినవి: 330

ముందుకు రాకపోవడానికి కారణాలివే

* ఎకరం, రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న వారు కల్లాలు నిర్మించే ప్రదేశంలో పంటలు పండే పరిస్థితి ఉండదు.

* నిర్మాణానికి మొదట ఖర్చు భరించాలని ఆసక్తి చూపడంలేదు. పూర్తయ్యాక కూడా బిల్లుల చెల్లింపులోనూ జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు.

* పెద్ద కమతాలు ఉన్నవారిలో కొందరు సొంతంగా డబ్బులను ఖర్చు చేసుకుని నిర్మించుకుంటున్నారు. అనంతరం బిల్లు ఎపుడు వచ్చినా తీసుకుంటున్నారు.

* కొన్ని చోట్ల ఇతరుల పొలాల్లో నిర్మించిన కల్లాల్లోనే పొరుగువారు వినియోగించుకుంటారు. ఇలాంటి సమయంలో వద్దనే పరిస్థితి ఉండదు.

* పది నుంచి ఇరవై మంది కలిపి అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలంలోనే నిర్మిస్తే అందరూ వినియోగించుకోవచ్ఛు

* కొందరికి ఉత్సాహం ఉన్నా కంకర, ఇసుక, సిమెంటును పొలాలకు తరలించేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.

రైతులకు మేలు చేసేందుకే... : - కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

రైతుల మేలు చేసేందుకే ఈ పథకాన్ని ప్రారంభించాం. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. కరోనా సమయంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు. లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తాం.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని