900 కిలోల కల్తీ టీ పౌడరు పట్టివేత
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నారాయణ
పరిగి: రాజధాని శివారు జిల్లాల్లో కల్లీ టీ పౌడరు విక్రయిస్తున్న ముగ్గురిని పరిగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి ఎస్పీ నారాయణ, డీఎస్పీ విజయ్‌కుమార్, ఎస్సై విఠల్‌రెడ్డితో కలిసి పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ఫోర్సు పోలీసులు పరిగిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన శెట్టి శ్రీను ఉంటున్న అద్దె ఇంట్లో తనిఖీ చేయగా 200 కిలోల కల్తీ టీ పౌడరు లభించింది. పోలీసులు తీగలాగి ఆరా తీయగా.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో తీసుకువస్తున్నట్లు వివరించాడు. అక్కడి వ్యాపారి శెట్టి వీరబాబు, దెందుకూరి కోదండరామ సత్యనారాయణరాజు వద్ద తనిఖీ చేయగా దాదాపు 700 కిలోలు లభించినట్లు తెలిపారు. మొత్తం 900 కేజీల కల్తీ టీ పొడి విలువ సుమారు రూ.4.5లక్షలు ఉంటుందని అన్నారు. టీ పొడి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో మరింతగా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు సిబ్బందిని ఆయన అభినందించారు.