పంప్‌హౌస్ పనుల్లో జాప్యమెందుకు?
పంప్ హౌస్‌ను పరిశీలిస్తున్న ఈఎన్సీ మురళీధర్, సీఈ మధుసూదన్
నిజామాబాద్ గ్రామీణం : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్‌లో నిర్మిస్తున్న పంప్‌హౌస్ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ ఇంజినీరు ఇన్ చీఫ్ మురళీధర్ ప్రశ్నించారు. శుక్రవారం ప్రాజెక్టులోని 20వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న సర్జ్‌ఫూల్, పంప్‌హౌస్ పనులను చీఫ్ ఇంజినీర్ మధుసూదన్‌తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సారంగపూర్ పంప్‌హౌస్ నుంచి వచ్చే మార్చిలో సాగునీటిని విడుదల చేయాలని, డిసెంబరు, జనవరిల్లో డ్రైరన్, ట్రయల్ రన్ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు పంపుల్లో భాగంగా రెండింటిని డిసెంబరులోగా సిద్ధం చేయాలన్నారు. గత వానాకాలంలో కల్వకుర్తి పంప్‌హౌస్ మునిగితే కేవలం 15 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేశామని.. ఇక్కడ రెండు నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కావడం లేదన్నారు.