చిత్ర వార్తలు
అతిథి కథ ఇది
చిత్రంలో పిచుకలను పోలి ఉన్న వీటిని వైర్ టెయిల్డ్ స్వాలోగా పిలుస్తారు. కూకట్పల్లిలోని ఐడియల్ రోడ్డు పక్కన కనిపించాయి. ఇవి మట్టిని తోడి ముక్కుతో తీసుకెళ్లి గిన్నె ఆకారంలో గూళ్లను నిర్మిస్తాయి. మగవాటికి తోకలు పొడవుగా తీగలా ఉంటాయి. ఆడవాటికి తోకలు పొట్టిగా ఉంటాయి. గుంపులుగా సంచరిస్తూ ఎక్కువగా నీళ్ల గుంటలు, పచ్చిక బయళ్ల వద్ద కనిపిస్తాయి. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉంటూ.. శీతాకాలంలో దక్షిణ భారతానికి వలస వస్తాయని జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవశాస్త్ర సహాయ అధ్యాపకులు బక్షి రవీందర్రావు తెలిపారు.
సేవలకు సలాం
హోప్ ఫర్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో కొవిడ్ సమయంలో సేవలు అందించిన ‘వైద్యులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులకు ‘ఫ్రంట్ లైన్ పాండమిక్ వారియర్స్-2021’ పేరిట మంగళవారం రవీంద్రభారతిలో పురస్కారాలు ప్రదానం చేశారు. హోంమంత్రి మహమూద్అలీ, లోక్సత్తా వ్యవస్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణ్, నటుడు శివారెడ్డి, నిర్వాహకులు నర్సింగరావు, సుధాజైన్, సుధీర్, వీజే రాకీ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -న్యూస్టుడే, రవీంద్రభార[తి
నాటడం మీ పని.. పీకి తినడం మా పని!
ఓఆర్ఆర్ సమీపంలోని బలిజగూడ పరిధిలో అటవీశాఖ నర్సరీ ఉంది. నిత్యం ఇక్కడ ప్లాస్టిక్ సంచుల్లో మొక్కలు నాటి సిద్ధం చేస్తున్నారు. తరచూ కొండెంగ రకం కోతులు వచ్చి మొక్కలు పీకి ఆకులను తింటున్నాయని ఇక్కడ పని చేస్తున్న మహిళలు వాపోతున్నారు.
కొంగలు కావాలా.. కొనేస్తే పోలా!
అవును నిజమే.. మీరు చూస్తున్న ఈ కొంగలను అమ్మకానికే పెట్టారు. కాకపోతే అవి నిజమైనవి కావు. సిమెంటుతో తీర్చిదిద్దిన కొంగ బొమ్మలను మన్సూరాబాద్ రహదారిపై ఇలా అమ్మకానికి పెట్టారు. దారిలో వెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి.
విరామం లేదు.. వాహనంలోనే విశ్రాంతి!
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో తీరిక లేకుండా పనిచేసి తిరిగి వెళుతున్న కార్మికులు సంబంధిత డీసీఎం వాహనంలో ఇలా వస్త్రంతో ఉయ్యాల కట్టుకుని సేదతీరుతున్నారు. బేగంపేట రోడ్డులో కనిపించిందీ చిత్రం.