Ts News: నష్టాలు తగ్గించేందుకే ఆర్టీసీ ఛార్జీల పెంపు: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

Updated : 01 Dec 2021 16:25 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పల్లె వెలుగుకు కిలోమీటర్‌కు రూ.25 పైసలు, మిగతా సర్వీసులకు కిలోమీటర్‌కు రూ. 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని మంత్రి చెప్పారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

‘‘బస్సు ఛార్జీలు పెరిగితే ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయి. గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లల్లో ఆర్టీసికి రూ.4,260 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడింది. ఆర్టీసీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,882 కోట్లు ఆదాయం రాగా, ఖర్చు రూ.5,811 కోట్లకు చేరుకుంది. అదే విధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,592 కోట్లు ఆదాయం రాగా.. ఖర్చు రూ. 5,594 కోట్లకు చేరింది. రూ.1,002 కోట్ల నష్టం నమోదు అయింది. 2020-21లో నాటికి ఆర్టీసీ ఆదాయం రూ. 2,455 కోట్లు ఉంటే.. ఖర్చు రూ.4,784 కోట్లుగా ఉంది. రూ.2,329 కోట్లు నష్టం వచ్చింది. ఒకవేళ ఛార్జీలు పెంచితే ఆర్టీసీకి ఏడాదికి రూ.850 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది’’ అని మంత్రి వివరించారు.

గత నెలలోనే ప్రతిపాదనలు పంపాం: ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి

‘‘ఛార్జీల పెంపు ప్రతిపాదనలు గతనెలలోనే సీఎంకు పంపించాం. డీజిల్‌ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారంగా మారింది. ఆర్టీసీ నిత్యం సగటున 6.8 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోంది. ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలి. గత మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్లు నష్టం వచ్చింది. నష్టాల తగ్గింపునకు టికెట్‌ ధరల పెంపే మార్గం’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని