logo
Published : 04/12/2021 01:13 IST

పాత తాండూరులో ప్రత్యేక వైద్యశిబిరం


పాత తాండూరు అంబేడ్కర్‌ ఉద్యానంలోని ట్యాంకు నుంచి వస్తున్న నీటిని పరిశీలిస్తున్న వైద్యాధికారులు

తాండూరు టౌన్‌,తాండూరు, న్యూస్‌టుడే: తాండూరు పట్టణం పాత తాండూరులో కలుషిత నీరు తాగి వృద్ధురాలు మృతి, 23 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటనపై రాష్ట్ర వైద్యశాఖ స్పందించింది. ఈమేరకు జాతీయ కీటక జన్యు వ్యాధుల నివారణ విభాగం రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌ తన బృందంతో శుక్రవారం రంగంలోకి దిగారు. ఆసుపత్రిలో చేరిన 23 మందిలో పది మంది తేరుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో వృద్ధురాలు చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్‌  ఆదేశాలతో పురపాలక సంఘం అధికారులు మరమ్మతు చేపట్టారు.

ఆందోళన చెందొద్దు: జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అమర్‌సింగ్‌ నాయక్‌ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ఆందోళన చెందవద్దని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.  అంబేడ్కర్‌ ఉద్యానంలోని ట్యాంకు నుంచి నీటిని వదిలి సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో తీవ్రత లేదన్నారు. వారంతా త్వరగా కోలుకుంటారన్నారు. పాత తాండూరులో ప్రత్యేకంగా వైద్యశిబిరం ఏర్పాటు చేశామని, నలుగురు వైద్యులతో పాటు సిబ్బంది, అంబులెన్సు, మందులు అందుబాటులో ఉంచామన్నారు. ఈ సంఘటనకు నీటి కలుషితమే కారణమని ప్రాథమికంగా తెలుస్తుందని చెప్పారు. రెండు రోజుల కిందట జాతరకు వెళ్లిన వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపిందని చెప్పారు. ఆహార కలుషితమా లేదా నీటి కలుషితమా అనే విషయం నీటి నమూనాల పరీక్షల నివేదిక వచ్చాకనే నిర్ధారిస్తామన్నారు. అప్పటి వరకు పైపుల ద్వారా నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.

కాచి చల్లార్చిన నీటిని తాగాలి: ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహారాన్ని భుజించాలని సూచించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినవద్దన్నారు. మూడు నాలుగు సార్లు వాంతులు, విరేచనాలు అయితే వెంటనే శిబిరానికి వెళ్లాలన్నారు. మరీ ఇబ్బందికరంగా ఉంటే జిల్లా ఆస్పత్రికి వెళ్లాలన్నారు. పరిస్థితిని పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య, మున్సిపల్‌ అధికారులు ప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి తుకారాం భట్‌, ఉప వైద్యాధికారి ధరణి కుమార్‌, జిల్లా ఆస్పత్రి పీపీ యూనిట్‌ ఇన్‌ఛార్జి డాక్టరు భాస్కర్‌, మున్సిపల్‌ డీఈఈ రంగనాథం, పారిశుద్ధ్య నిర్వహణ అధికారి శ్యాంసుందర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత
తాండూరు పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే కాగ్నానది పంప్‌హౌస్‌ ప్రధాన గొట్టం మరమ్మతు నేపథ్యంలో శని, ఆదివారం పట్టణానికి నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు మున్సిపాలిటీ డీఈఈ రంగనాథం తెలిపారు. మరోవైపు  పట్టణానికి నీటిని సరఫరా చేసే మిషన్‌భగీరథ పైపులను అనుసంధానించే పనులు చేపడతామని తెలిపారు. ట్యాంకులను రెండు రోజుల పాటు శుభ్రం చేస్తామన్నారు. మృతి చెందిన బసమ్మ కుటుంబ సభ్యులతో మాట్ల్లాడారు. ఘటనకు కారణాలను అన్వేషించేందుకు పాత తాండూరుకు సరఫరా జరిగే నీటినమూనాలను, బాధితుల ఇళ్లల్లోని ఆహార నమూనాలను సేకరించారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని