logo
Published : 04/12/2021 01:13 IST

నిధుల్లో కొంత..వెచ్చిస్తే భవిత

పంచాయతీలకు పాఠశాలల బాధ్యత
న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణ

కొడంగల్‌ ప్రాథమిక పాఠశాల గదిలో బండల దుస్థితి

సర్కారు పాఠశాలల బలోపేతానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నా.. పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేకపోతున్నారు.  అధికారులు పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉంటోంది. సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారు కరవయ్యారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం, పేదల పిల్లలే ఈ బడుల్లో చదువుకోవడం వంటి కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో స్థానికంగానే పంచాయతీలకు బాధ్యత అప్పగిస్తే మార్పునకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచించింది. వీటికి వచ్చే నిధుల్లో కొంత సమస్యల పరిష్కారానికి వెచ్చించవచ్చంటూ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

బురాన్‌పూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఊడిపడుతున్న పైకప్పు పెచ్చులు

పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు, అవసరమైన మరమ్మతులు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 14, 15వ ఆర్థికసంఘం నిధులను విడుదల చేస్తోంది. ప్రతి నెల పంచాయతీలకు అందుతున్న వీటి నుంచే ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 768 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 174 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటితో పాటుగా 18 కస్తూర్బా, 9 తెలంగాణ నమూనా పాఠశాలలు, 11 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. వసతులు కల్పించే బాధ్యతను పంచాయతీలకు అప్పగించటంతో నిధులు ఎలా ఖర్చు చేస్తారోనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. వీరు ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శించి పరిస్థితిని సమీక్షించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న ఆర్థికసంఘం నిధుల్లో 20శాతం విద్యుత్‌ బిల్లులకు, 30శాతం ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. మిగిలిన 50శాతంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రస్తుతం ఇస్తున్న నిధులు గ్రామాభివృద్ధికే సరిపోవటం లేదని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. చిన్న పంచాయతీల్లో ట్రాక్టర్ల వాయిదాలు, నిర్వహణ, కార్మికుల జీతాలు చెల్లించేందుకు సరిపోతుండగా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించటం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.

పెరిగిన సంఖ్య: కొవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత పాఠశాలలు ప్రారంభించటంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. నిర్వహణకు నిధులు అందకపోవటంతో వివిధ సమస్యలు తిష్టవేశాయి. ఈ క్రమంలోనే పంచాయతీలు, గ్రామస్థులు, విద్యాకమిటీలు సంయుక్తంగా వివిధ రకాల పనులు చేసుకోవచ్చని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులను దశల వారీగా చేసుకుంటనే మేలు కలుగుతుంది. ముందుగా పాలకవర్గం సభ్యులు, విద్యాకమిటీలు ఉపాధ్యాయులతో కలిసి సమస్యను గుర్తించాలి. అందులో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటే విద్యార్థులకు సౌకర్యం కలుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.


చేయాల్సిన పనులు

* విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించటం, పైపులైన్‌ నిర్మాణాలు, లీకేజీలు లేకుండా చూడటం, చేతుల శుభ్రతకు యూనిట్ల నిర్మాణాలు.

* ప్రత్యేక అవసరాల పిల్లలకు ర్యాంపులు, శౌచాలయాలను నిర్మించాలి.

* మధ్యాహ్న భోజనాలకు వంటగదుల్లో వసతులు కల్పించటం, షెడ్ల నిర్మాణం, పెరటితోటల పెంపకం.

* విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోవటం, అంతరాయం లేకుండా తీగలు సరిచేసుకోవటం, మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు.

* తరగతి గదులు, శౌచాలయాల్లో ఫ్లోరింగ్‌ బాగు చేసుకోవటం, తలుపులు, కిటికీలు, ప్రహరీ, బల్లలు బాగు చేసుకోవడం.

* క్రీడా మైదానాలను బాగు చేస్తూ, ఆటలకు అనువుగా మార్చడం.

* పాఠశాల భవనంపై పడుతున్న వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతల నిర్మాణం.


ఆదేశాల ప్రకారం కార్యాచరణ: మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల బాగోగులు చేసుకునేందుకు పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ ప్రకారమే కార్యాచరణ రూపొందిస్తాం. సమస్య ప్రాముఖ్యతను గుర్తించి పనులు చేపట్టాలి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులు, విద్యాకమిటీలతో సమన్వయంగా ఉంటూ సదుపాయాలు కల్పించాలి. ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులు సమర్పించాలి.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని