Crime News: డబ్బు ఇచ్చి.. తీసుకున్నట్టు ఆధారాల్లేవ్‌!

వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరిని రెండురోజులు పోలీసు కస్టడీకు తీసుకున్నారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో...

Updated : 04 Dec 2021 12:50 IST

మొదటిరోజు పోలీసు కస్టడీలో శిల్పా చౌదరి
సీబీఐ తరహాలో సాగిన విచారణ!
ఈనాడు, హైదరాబాద్‌ నార్సింగి, న్యూస్‌టుడే

వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరిని రెండురోజులు పోలీసు కస్టడీకు తీసుకున్నారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు. భవన నిర్మాణాలు, రియల్‌ ఎస్టేట్‌, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలిస్తామంటూ బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దంపతులను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు శిల్పా చౌదరిని కస్టడీకు తీసుకున్నారు. మొదటిరోజు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నార్సింగిలోని ఎస్‌వోటీ కార్యాలయంలో మహిళా పోలీసు అధికారి సమక్షంలో విచారణ జరిపారు. పక్కా ఆధారాలను ఆమె ఎదుట ఉంచి సీబీఐ తరహాలో విచారణ నిర్వహించారు. తొలుత, తనకేం తెలియదంటూ చెప్పే ప్రయత్నం చేసిన ఆమె, లెక్కల కాగితాలను కొన్ని ఎదురుగా ఉంచడంతో ఆమె ఒకింత భావోద్వేగానికి గురైంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి కోసం వారి వద్ద నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేశానని చెప్పింది. వారి నుంచి డబ్బు తీసుకున్నట్టు.. మళ్లీ ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాల్లేవని చెప్పినట్టు సమాచారం. ఆ వివరాలను నార్సింగి పోలీసులు రికార్డ్‌ చేసుకున్నారు. బాధితుల నుంచి శిల్పాచౌదరి దంపతులు తీసుకున్న భారీ మొత్తంతో కొనుగోలు చేసిన భూములను కూడా పోలీసు అధికారులు పరిశీలించినట్టు సమాచారం. భూ లావాదేవీలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ నుంచి తీసుకోనున్నారు. విచారణ అనంతరం ఎస్వోటీ కార్యాలయంలోనే పోలీసు భద్రత మధ్య ఆమెను ఉంచారు. మరో కేసులో బెయిల్‌లో రాకపోవడంతో శిల్పాచౌదరి భర్త జైలులోనే ఉన్నాడు. 


ఆ డబ్బంతా ఎక్కడికెళ్లింది..?

శిల్పాచౌదరి దంపతుల మోసం కేసులో ఎన్నో సందేహాలు, అనుమానాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన మహిళల నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. పోలీసులకు మాత్రం ముగ్గురే ఫిర్యాదు చేశారు. రూ.కోట్టలో నగదును నిందితులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్త పడటానికి కారణాలు, లెక్కల్లో చూపని నల్లడబ్బును మార్చేందుకు ఇతరులు శిల్పాచౌదరి ద్వారా వ్యాపారం నిర్వహించాలని భావించారా! అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. నిందితుల బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. 


సెహరిలో ఆమె వాటా ఎంత?

శిల్పాచౌదరి నిర్మాతగా టాలీవుడ్‌లో సెహరి సినిమా నిర్మాణం చేపట్టారు. ఈ సినిమా కథానాయకుడి నుంచి కూడా ఆమె రూ.3కోట్లు తీసుకుందన్న ప్రచారమూ సాగింది. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఆమె 12శాతం వాటాదారుగా ఉన్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రారంభమయ్యాక మనస్పర్థలు తలెత్తడంతో ఆమె తప్పుకొన్నట్టు సమాచారం. శిల్పాచౌదరి రూ.3కోట్లు తీసుకున్నట్టుగా తాను ఫిర్యాదు చేశాననేది అవాస్తవమని కథా’నాయకుడు హర్ష్‌ తెలిపారు. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, తనపై వస్తున్న ప్రచారానికి రెండుమూడ్రోజుల్లో సమాధానం చెబుతానని పేర్కొన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు