logo
Published : 04/12/2021 02:05 IST

బలహీన హృదయం..రెండు డోసులతోనే పదిలం

తక్షణం టీకాలు వేయించుకోవాలి అంటున్న వైద్యులు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధానిలో ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో కొవిడ్‌ బారినపడి గుండె వ్యాధిగ్రస్థులుగా మారిన వారు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజధాని సహా చుట్టుపక్కల జిల్లాల్లో సుమారు 5 లక్షల మంది కరోనా బారిన పడిఉంటారని అంచనా. వీరిలో చాలామంది గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతూ.. ప్రతి నెలా వైద్య పరీక్షలకు ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచిస్తున్నారు.

తొలి, మలి దశలో కొవిడ్‌ సోకిన ప్రతి వంద మందిలో 20 మంది ఐసీయూలో చికిత్స పొందారు. ఇలాంటివారి ఊపిరితిత్తులపై వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ ప్రభావం గుండె పనితీరుపైనా పడింది. ఫలితంగా కొందరిలో గుండెకు సంబంధించిన కండరాలు కుంచించుకు పోవడం, మరికొందరిలో గట్టి పడడాన్ని వైద్యులు గుర్తించారు. ఈ పరిణామంతో రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తి హృదయం లయను దెబ్బతీస్తోంది. ఆరేడు నెలల కిందట కరోనా సోకి కోలుకున్న వారిలోనూ కొందరి రక్త నాళాల్లో పూడికలు బయటపడుతున్నాయి.

ఒమిక్రాన్‌తో ముప్పు.. గ్రేటర్‌లో ఇంకా 10.50 లక్షల మంది మొదటి డోసు కూడా వేసుకోలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నారు. కారణాలు ఆరాతీస్తే వీరిలో చాలామంది కరోనా సోకిన వారేనని తేలింది. ఒకసారి మహమ్మారి బారిన పడ్డాక మళ్లీ సోకదనే ధైర్యంతోనే ఒక్క డోసూ వేయించుకోలేదని క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు. రెండో డోసు వేసుకోని వారు 26.31 లక్షలమంది ఉన్నారు. వీరిలో కరోనా సోకి కోలుకున్న వారూ ఇదే కారణం చెబుతున్నారు. ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో వీరంతా టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఇది ఓ నిదర్శనం  

మూసాపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగికి కొన్ని నెలల కిందట మహమ్మారి సోకి తగ్గింది. నెల రోజుల కిందట విధులకు బయలుదేరుతుండగా ఇంట్లోనే గుండెపోటుతో కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా మూడు రక్తనాళాల్లో పూడిక ఉందని వైద్యులు తేల్చి స్టంట్లు వేశారు. కరోనా అనంతర పరిణామమని తేల్చారు.


టీకాయే రక్ష
డాక్టర్‌ జి.రమేష్‌, గుండెవ్యాధుల నిపుణులు, స్టార్‌ ఆస్పత్రి

రు నెలల కిందట కరోనా సోకింది.. గుండెలో ఏదో ఇబ్బంది ఉందంటూ ఇప్పటికీ అనేకమంది చికిత్సకు వస్తున్నారు. ఒమిక్రాన్‌ ఆందోళన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేయించుకుంటే కొంతలో కొంత రక్షణ ఉంటుంది.


ఒమిక్రాన్‌ అలజడి!
జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఒమిక్రాన్‌ అలజడి కొనసాగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెరుగుతోంది. పాజిటివ్‌ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు 13 మంది ఆసుపత్రిలో చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విదేశాల నుంచి కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ యువతి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించిన అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు.  యువతి ఇంటికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆమెను టిమ్స్‌కు తరలించడంతోపాటు కుటుంబ సభ్యులను హోం క్యారంటైన్‌లో పెట్టారు. ఆ యువతి ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారో ఆరా తీస్తున్నారు.

విమానాశ్రయంలో అప్రమత్తం
ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు విస్తృతం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ స్క్రీనింగ్‌ చేస్తుండగా.. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రం స్క్రీనింగ్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసి ఫలితాలు వచ్చాకే విడిచిపెడుతున్నారు. నెగిటివ్‌ వచ్చిన ప్రయాణికులను ఇంటికి పంపిస్తున్నారు. పాజిటివ్‌గా తేలితే నేరుగా గచ్చిబౌలిలోని టిమ్స్‌ లేదా గాంధీ ఆసుపత్రికి పంపించి ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని