logo

ఖాతాలో కోత.. జేబుకు వాత

ఏటీఎంలలో సాంకేతిక సమస్యలు సృష్టించి.. తెలివిగా డబ్బును డ్రా చేసుకుని.. నగదు రాలేదంటూ కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదులు చేస్తూ బ్యాంకులను మోసగిస్తున్న ఓ ముఠా గుట్టును

Published : 05 Dec 2021 01:50 IST

ఏటీఎంలలో సాంకేతిక సమస్యలు సృష్టించి మోసాలు

నలుగురి అరెస్టు, 26 కార్డులు స్వాధీనం

నిందితులతో డీఐ ఎస్‌.వీరయ్య

కేశవగిరి, న్యూస్‌టుడే: ఏటీఎంలలో సాంకేతిక సమస్యలు సృష్టించి.. తెలివిగా డబ్బును డ్రా చేసుకుని.. నగదు రాలేదంటూ కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదులు చేస్తూ బ్యాంకులను మోసగిస్తున్న ఓ ముఠా గుట్టును చాంద్రాయణగుట్ట పోలీసులు రట్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 26 ఏటీఎం కార్డులు, రూ.25వేల నగదు, 4 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ డాక్టర్‌ గజరావుభూపాల్‌ కథనం ప్రకారం.. హరియాణా రాష్ట్రం నోహు మెవాతీ ప్రాంతానికి చెందిన ఆసిఫ్‌ఖాన్‌(23), మహ్మద్‌ సాధిక్‌(22) బంధువులు. ఆటోడ్రైవర్లయిన వీరు అధికంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఏటీఎంలో సాంకేతిక సమస్యలు సృష్టించి బ్యాంకులను మోసగించే కుట్రను హరియాణాలోనే నేర్చుకున్నారు. హైదరాబాద్‌లో ప్రయోగించేందుకు ఇద్దరూ బండ్లగూడలో దిగారు. పహాడీషరీఫ్‌లోని సెంట్రింగ్‌ కార్మికుడు మహ్మద్‌ అబ్దుల్‌ రెహాన్‌(22), వాది-ఏ-ముస్తఫా ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ సొహెల్‌(24)లు వీరికి బంధువులు. ఆసిఫ్‌ఖాన్‌ తన, తన భార్య పేరిట, సాధిక్‌, రెహాన్‌, సొహెల్‌తో పాటు వారి బంధువుల పేర్లతో వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు తెరిపించి, 26 ఏటీఎం కార్డులు పొందారు. ఆసిఫ్‌ఖాన్‌ అద్దెకు ఓ ఆటోను తీసుకున్నాడు. నలుగురూ ఆటోలో తిరుగుతూ నగరంతో పాటు శివార్లలోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. సెక్యూరిటీ, రద్దీ లేని ఏటీఎంలను టార్గెట్‌ చేసుకుంటారు.

ఒకరు లోపల.. ముగ్గురు బయట

ఒకరు ఎటీఎం లోపలికి వెళితే మిగతా వారు బయట కాపలాగా ఉంటారు. డబ్బు కోసం ఏటీఎంలో కార్డును స్వైప్‌ చేస్తారు. పిన్‌, నగదు నమోదు చేస్తారు. ఏటీఎం నుంచి డబ్బు వచ్చిన తరువాత కరెన్సీని డిస్పెన్స్‌ స్లాట్‌ వద్దనే గట్టిగా పట్టుకుని 30 సెకన్ల వరకు బయటికి లాగకుండా అలాగే ఉంచుతారు. కస్టమర్‌ స్పందించడం లేదని గుర్తించే యంత్రం ‘ట్రాన్సాక్షన్‌ టైమ్‌ ఔట్‌’ అంటూ తెరపై చూపుతుంది. బయటికి వచ్చిన డబ్బును వెంటనే యంత్రం తిరిగి లోనికి తీసుకుంటుంది. ఒక కరెన్సీ నోటును లోనికి వెళ్లేలా చేసి మిగిలిన డబ్బును సీసీ కెమెరాకు చిక్కకుండా తీసుకునేవారు.

డబ్బు రాలేదని ఫిర్యాదు

వెంటనే బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినా ఏటీఎం లోంచి రాలేదని ఫిర్యాదు చేస్తారు. నాలుగైదు రోజుల్లో తిరిగి ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేసేవారు. ఎస్‌బీఐ ఏటీఎంలనే వీరు ఎక్కువగా వినియోగించేవారు. ఏటీఎం మోసాలపై అప్రమత్తంగా ఉండే చాంద్రాయణగుట్ట సీఐ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ, డీఐ ఎస్‌.వీరయ్య బృందం చాంద్రాయణగుట్ట హాషామాబాద్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆసిఫ్‌, అతని అనుచరులను పట్టుకోవడంతో మోసం బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని