logo
Published : 06/12/2021 02:50 IST

చెరువులు ఇక చరిత్రేనా?

ఆక్రమణలతో మిగిలింది కుంటలే
సుందరీకరణకు నోచుకోని ఫలితం
ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, యూసుఫ్‌గూడ,
కేశవగిరి, ఆసిఫ్‌నగర్‌, అంబర్‌పేట, కూకట్‌పల్లి, దుండిగల్‌

నగరంలో ఏ చెరువు చూసినా.. ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. తటకాలు కనుమరుగై.. భారీ భవంతులు పుట్టుకొస్తున్నాయి. ఆక్రమణలను అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో నిర్మాణాలు ఆగడం లేదు. గ్రేటర్‌ సహా శివారు ప్రాంతాల్లోని చెరువులు కబ్జాల వలలో చిక్కుకున్నాయి. ఏళ్ల తరబడి  రెవెన్యూ, నీటి పారుదల శాఖల నిస్తేజాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.


చెరువులంటే సాగు, తాగునీరు అందించే వనరులు..! ఆహ్లాదాన్ని పంచే ప్రదేశాలు..!!  ఇదంతా ఒకప్పటి మాట.!!! ఆక్రమణల దరువు ఇప్పటి మాట!!!!


పెద్దతటాకం.. చిన్న కొలనుగా మారి

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట యూసుఫ్‌గూడ అంటే పోలీస్‌ మొదటి పటాలం, పెద్ద చెరువు, చిన్నచెరువు గుర్తుకు వచ్చేవి. దాదాపు 35 ఎకరాల్లో పెద్దచెరువు విస్తరించి ఉండేదని అంచనా. రానురానూ పెద్ద చెరువులోని భాగం కబ్జాకు గురైంది. ఉన్న కాస్త స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రహరీ నిర్మించి 2004లో కృష్ణకాంత్‌పార్కును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పార్కు మధ్యలో ఉన్న చిన్న కొలను ప్రాంతమే గతంలో పెద్దచెరువుకు ఆనవాలుగా మిగిలింది. యాదగిరినగర్‌, జవహర్‌నగర్‌ పెద్దచెరువులోనే పుట్టుకొచ్చాయి. ఇక చిన్నచెరువులోనే లక్ష్మీనర్సింహనగర్‌ బస్తీ ఏర్పడింది. శ్రీకృష్ణానగర్‌ ఏ-బ్లాకులోని కొద్ది ప్రాంతం సైతం ఇందులోనే ఏర్పడింది.

* ప్రాంతం: యూసుఫ్‌గూడ

* పేరు: పెద్దచెరువు

* విస్తీర్ణం: 35 ఎకరాలు

* మిగిలింది: చిన్న కొలను


పాతబస్తీ.. కబ్జాలతో జబర్దస్తీ

పాతబస్తీ బార్కస్‌లోని గుర్రంచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ ఎక్కడా కనిపించకుండా మాయమైంది. పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. రాయల్‌కాలనీ వైపున రోహింగ్యాల పేరుతో చెరువును కబ్జా చేస్తున్నారు. చెరువు సుందరీకరణకు 2015లో మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసినా.. ముందుకు సాగడం లేదు. అక్రమ కట్టడాలను కూల్చివేసి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాల్సి ఉండగా.. కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ అధికారులు ఫెన్సింగ్‌ పనులు చేపట్టారు. బార్కస్‌, సలాలావైపు ట్రాక్‌ నిర్మాణ పనులే చేపట్టలేదు.

* ప్రాంతం: బార్కస్‌

* పేరు: గుర్రంచెరువు

* విస్తీర్ణం: 90.69 ఎకరాలు

* మిగిలింది: 20 ఎకరాలు


శంకుస్థాపన చేసి పనులు చేయక

బండ్లగూడలోని సూరం తటాకం రూపురేఖలు కోల్పోయింది. 2000లో హుడా నివేదిక ప్రకారం 46.95 ఎకరాలు ఉండేది. తర్వాత హెచ్‌ఎండీఏ జారీ చేసిన నోటిఫైడ్‌ మ్యాప్‌లో 39.30 ఎకరాలున్నాయి. 12 ఎకరాలే మిగిలింది. ప్రజాప్రతినిధుల అండతో.. పట్టా భూములున్నాయంటూ పెద్దఎత్తున ఆక్రమణలు వెలిశాయి. చెరువులో రూ.2.39 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టినా.. పూర్తి కాలేదు. ముళ్ల చెట్లు పెరిగి ట్రాక్‌ అధ్వానంగా మారింది.

* ప్రాంతం: బండ్లగూడ

* పేరు: సూరం కాసారం

* విస్తీర్ణం: 46.95 ఎకరాలు

* మిగిలింది: 12 ఎకరాలు


మిగిలేదెంతో..  ఆ ‘దేవుని’ దయ!

కాకతీయుల కాలంలో ఎన్‌ఎండీసీ సమీపంలోని గుట్టపై వేంకటేశ్వర స్వామి ఆలయం కోసం హుమాయున్‌నగర్‌లో దేవుని కుంట నిర్మించారు. 1965-1975 వరకు జరిపిన టౌన్‌ సర్వే రికార్డుల ప్రకారం ఆసిఫ్‌నగర్‌ సర్వే నం.22లో 11.2 ఎకరాలలో విస్తరించి ఉంది. చెరువుపై పర్యవేక్షణ కొరవడి నాలుగువైపులా కబ్జాల బారిన పడింది. ఏడు ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.మూడేళ్ల కిందట మిగిలిన దాన్ని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు ప్రయత్నించారు. కబ్జా విషయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు ఆసిఫ్‌నగర్‌ తహసీల్దార్‌ను అప్పటి కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

* ప్రాంతం: హుమాయున్‌నగర్‌

* పేరు: దేవునికుంట

* విస్తీర్ణం: 11.2ఎకరాలు

* మిగిలింది: 4.5 ఎకరాలు


‘బతుకమ్మా’.. కుంటను బతికించే దారేది..?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మలను మహిళలు అంబర్‌పేటలోని కుంట (చెరువు)లో నిమజ్జనం చేయడం వల్ల దీనికి బతుకమ్మ కుంట అనే పేరు వచ్చింది. 1961-62లో బతుకమ్మకుంట 13.29 ఎకరాల్లో ఉండగా దాదాపు ఎనిమిది ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ లోపల, వెలుపల అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల శాఖలు స్పందించి పరిరక్షించకుంటే పూర్తిగా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉంది.

* ప్రాంతం: అంబర్‌పేట

* పేరు: బతుకమ్మకుంట

* విస్తీర్ణం: 13.29 ఎకరాలు

* మిగిలింది: 5.12 ఎకరాలు


వానొస్తే అక్రమ కట్టడాలు మునకే

* బౌరంపేట సర్వే నం.755లో 9.03 ఎకరాల్లోని పెద్దచెరువు అర ఎకరా మేర ఆక్రమణకు గురైంది. ఐదేళ్లక్రితం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోనూ ఓ నిర్మాణ సంస్థ విల్లాలను నిర్మించింది. గతేడాది భారీ వర్షాలకు గేటెడ్‌ కమ్యూనిటీని వరదనీరు ముంచెత్తింది.

* దుండిగల్‌ సర్వే నం.405లో 78.20 ఎకరాల్లో ధామరచెరువు విస్తరించింది. పదేళ్ల క్రితం ఓ కళాశాలకు చెందిన నిర్మాణాలు వెలిసినా.. నీటి పారుదల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు.


అధికార పార్టీ నేతల చెరలో..

కాముని చెరువును పూడ్చి చదును చేసిన ప్రాంతం

కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో 15 చెరువులున్నాయి. 10 చెరువులు చాలావరకు కబ్జాకు గురవ్వగా.. మరో 5 చెరువులు స్వల్పంగా ఆక్రమణకు గురయ్యాయి. అల్లాపూర్‌, మూసాపేట ఆనుకొని ఉండే సున్నం, కాముని చెరువులను అధికార పార్టీకి చెందిన నేత దర్జాగా కబ్జా చేస్తున్నాడు.

* సున్నంచెరువు 24.12ఎకరాలలో ఉండగా.. 8.89ఎకరాలు మేర ఆక్రమణకు గురైంది. వందలాది ఇళ్లు కాలనీలో నిర్మించారు.

* కాముని చెరువులో పాత కట్టతో సహా చెరువును పూడ్చివేసి కొత్తగా అనుకూలంగా కృత్రిమ కట్ట ఏర్పాటుచేసి 400గజాల స్థలాన్ని కాజేసేందుకు ఇక్కడి అధికార పార్టీ నాయకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

* మైసమ్మ చెరువు 10ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇక్కడ ఒక రియల్‌ఎస్టేట్‌ కంపెనీ నిర్వాహకులు, స్థానిక నేతలు కొందరు ఆక్రమించి భవనాలు, ఇళ్లు నిర్మించారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని