5 రోజుల్లో రూ.250 కోట్ల మద్యం విక్రయాలు
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఈ నెలలో 5 రోజుల్లో రూ.250 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో రోజుకు రూ.30-34 కోట్లు జరిగేవి. ప్రస్తుతం రోజుకు రూ.50 కోట్ల వరకూ విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. గతేడాదితో పోల్చితే బీర్లు 30 శాతం, దేశీయ మద్యం 20శాతం కొనుగోళ్లు పెరిగాయి.
4470 మందిపై కేసులు.. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల అదుపునకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు పెంచారు. నగర పరిధిలో నవంబరులో నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 4470 మందిపై కేసులు నమోదు చేశారు.. వీరిలో 1527 మందిపై ఛార్జిషీటు నమోదు చేసి కోర్టుల్లో హాజరుపరిచారు. 1480 మందికి రూ.1,55,44,200 జరిమానా, నలుగురి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేశారు. ఇద్దరికి 12 రోజులు, 24 మందికి 7 రోజులు, 21 మందికి 5 రోజులు జైలు శిక్ష విధించారు. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మిగిలిన 2943 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్టు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.