మూడు కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు
పంజాగుట్ట, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పంజాగుట్ట పోలీసులు మాటు వేసి మూడు కేజీల సరకు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కర్నేడి రవితేజ కూకట్‌పల్లిలోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐడీఏ బొల్లారంలో నివాసం ఉండే గోకర్ల పాపారావు, కార్తిక్ అలియాస్ నాని చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ గంజాయి క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఆదివారం సాయంత్రం కార్తిక్ మూడు కేజీల గంజాయి తీసుకువచ్చి అమీర్‌పేట బిగ్ బజార్ వద్ద రవితేజ, పాపారావులకు ఒక కేజీ రూ.6వేల చొప్పున విక్రయించాడు. ఇదే సమయంలో పోలీసులు దాడి చేయగా కార్తిక్ తప్పించుకున్నాడు. రవితేజ, పాపారావులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్.ఐ. తెలిపారు. పరారీలో ఉన్న కార్తిక్ కోసం గాలింపు చేపట్టినట్లు వివరించారు.