logo

ఇక్కడ పోగుచేసి.. పొరుగు రాష్ట్రాలకు

నగరం నుంచి గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఇతర జిల్లాల్లో పట్టుకుంటున్నారు. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు

Published : 07 Dec 2021 02:38 IST

అక్రమంగా రేషన్‌ బియ్యం తరలింపు
పక్క జిల్లాల్లో స్వాధీనం చేసుకుంటున్న అధికారులు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

గరం నుంచి గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఇతర జిల్లాల్లో పట్టుకుంటున్నారు. ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నా దందాకు అడ్డుకట్ట పడటంలేదు. గ్రేటర్‌ పరిధిలో పౌరసరఫరాల శాఖ అధికారులు జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 400 కుపైగా కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా కార్డుదారుల నుంచి సేకరించిన రేషన్‌ బియ్యంను అక్రమ మార్గంలో తరలించడం సర్వసాధారణమైపోయింది. చిల్లరగా వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి వాటిని పెద్ద మొత్తంలో లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
బాహ్యవలయ రహదారి మీదుగా...
నగరంలో వివిధ ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటుచేసుకుని అక్కడి నుంచి బాహ్యవలయ రహదారి మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జహీరాబాద్‌, మెదక్‌ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేసి సీజ్‌ చేస్తున్నారు. మూడు నెలల క్రితం నగరం నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 900 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇటీవల 36 టన్నుల రేషన్‌ బియ్యాన్ని జహీరాబాద్‌ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో పోగు చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న 530 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ప్రతినెలా కొన్ని వందల క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నారు.

లబ్ధిదారుల నుంచే సేకరణ...
నగరంలోని కొందరు రేషన్‌ డీలర్లు లబ్ధిదారుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి వ్యక్తికి పది కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఈ బియ్యం తినని ఒక్కో కుటుంబం నుంచి 40 కిలోలకు మించకుండా సేకరిస్తున్నారు. రేషన్‌ దుకాణంలో తీసుకున్న కార్డుదారులు.. డీలర్లకు లేదా తమ వద్దకు వచ్చే చిరువ్యాపారులకు కిలోకు రూ.8 చొప్పున అమ్ముతున్నారు. ఇలా పోగైన బియ్యాన్ని మరో వ్యాపారికి రూ.10 నుంచి రూ.12 వరకు, అక్రమ దందాలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి అంతిమంగా రూ.15 వెచ్చించి కొనుగోలు చేసి..ఇతర రాష్ట్రాల్లో రూ.20 అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వివిధ ఆహార పదార్థాల తయారీలో వీటిని వాడుతుంటారు. నాణ్యత లేని వాటిని దాణా తయారీకి వినియోగిస్తుంటారని తెలిసింది. కొంతకాలంగా ఈ దందా జరుగుతున్నప్పటికీ అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రధాన పాత్రధారులపై దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకుంటాం
- ఎ.రమేశ్‌, డీఎస్‌వో

నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెడుతున్నాం. ప్రజా పంపిణీకి సంబంధించి బియ్యం కొనుగోలు చేసినా, విక్రయించినా నేరం. వారిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. కార్డులు రద్దు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు