logo

మద్యం మత్తులో మరణ మృదంగం

పీకలదాకా మద్యం తాగిన మందుబాబులు ఖరీదైన కార్లు నడుపుతూ బీభత్సం సృష్టించారు. నలుగురి ప్రాణాలు బలిగొన్నారు. బంజారాహిల్స్‌, నార్సింగి ప్రాంతాల్లో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఉప్పల్‌ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఈఎల్‌వీ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌  రోహిత్‌గౌడ్‌(29),  కర్మన్‌ఘాట్‌కు చెందిన సాయిసోమన్‌(27) స్నేహితులు. మరో యువకుడితో కలిసి ఖరీదైన పోర్షే కారులో బయల్దేరారు.

Updated : 07 Dec 2021 05:02 IST

పీకల దాకా తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలు
రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురి దుర్మరణం

ఈనాడు, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, నార్సింగి న్యూస్‌టుడే: పీకలదాకా మద్యం తాగిన మందుబాబులు ఖరీదైన కార్లు నడుపుతూ బీభత్సం సృష్టించారు. నలుగురి ప్రాణాలు బలిగొన్నారు. బంజారాహిల్స్‌, నార్సింగి ప్రాంతాల్లో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.

మూడు చోట్ల మద్యం తాగి
ఉప్పల్‌ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఈఎల్‌వీ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌  రోహిత్‌గౌడ్‌(29),  కర్మన్‌ఘాట్‌కు చెందిన సాయిసోమన్‌(27) స్నేహితులు. మరో యువకుడితో కలిసి ఖరీదైన పోర్షే కారులో బయల్దేరారు. ఆదివారం రాత్రి దుర్గం చెరువు వద్ద ఆలివ్‌ బిస్ట్రోలో మద్యంతో విందు చేసుకున్నారు. తర్వాత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లోని ఫ్యాట్‌ పీజియన్‌ పబ్‌కు వెళ్లి మళ్లీ మద్యం తాగారు. అనంతరం బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూప్లాజా హోటల్‌కు వెళ్లి మరోసారి మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక 1.20 గంటల ప్రాంతంలో పార్క్‌హయత్‌ వైపు 80-120 కి.మీ. వేగంతో వెళ్లారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2 రెయిన్‌బో ఆసుపత్రిలో యుటిలిటీ బాయ్‌గా పనిచేసే అయోధ్యరాయ్‌(23), అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేసే దేబేంద్రకుమార్‌దాస్‌ టీ తాగి రోడ్డు దాటుతున్నారు. మద్యం మత్తులో కారును అదుపు చేయలేకపోయిన రోహిత్‌గౌడ్‌ వారిని వేగంగా ఢీకొట్టాడు. ఇద్దరూ విభాగిని ఆవల ఉన్న ఆసుపత్రి వైపునకు పడ్డారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న క్షతగాత్రుల పట్ల మానవత్వంతో స్పందించకుండా కారులోని ముగ్గురు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు కారుతో ఉడాయించారు. అదే సమయంలో జూబ్లీహిల్స్‌ ఠాణాలో పనిచేసే హోంగార్డు జితేందర్‌సింగ్‌, కానిస్టేబుల్‌ సతీష్‌  జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 5లో గస్తీ కాస్తున్నారు. ముగ్గురు రాంగ్‌రూట్‌లో కారులో వస్తున్నట్లు గుర్తించారు. కారును ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ సమీపంలోని శ్రీపద్మావతి నిలయం సెల్లార్‌లో నిలిపి.. బీఎండబ్ల్యు కారులో వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు సెల్లార్‌లోని కారు ఫొటోలు తీసుకున్నారు. డీఎస్సై హరీశ్వర్‌రెడ్డికి ఆ ఫొటోలు పంపగా వాటిని బంజారాహిల్స్‌ పోలీసులకు పంపారు. జితేందర్‌సింగ్‌కు రాత్రి 2.55 గంటల సమయంలో సెల్లార్‌లో నిలిపిన కారు వద్దకు వెళ్లాడు. ఆయన్ను చూసి నిందితులు ముగ్గురు పారిపోయేందుకు యత్నించారు. మీరు చేసిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని వైద్యం చేయించాలంటూ నమ్మించగా అంగీకరించారు. డీఎస్సై చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. మూడో వ్యక్తి పరారయ్యాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్‌గౌడ్‌ రక్తంలో మద్యం మోతాదు 70ఎంజీ, సాయిసోమన్‌కు 50ఎంజీగా ఉంది.


చూసీచూడనట్లు వదిలేయండి!

ఈనాడు, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ ఘటనలో నిందితుడైన రోహిత్‌గౌడ్‌ను తప్పించేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు, కొందరు నేతలు రంగంలోకి దిగారు. ‘మావాళ్లే చూసీచూడనట్టు వదిలేయమంటూ’ పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా ఠాణాకు వచ్చి మాట్లాడినట్టు తెలుస్తోంది. బీటెక్‌ చదివిన రోహిత్‌గౌడ్‌ తండ్రి ఉప్పల్‌ కూడలిలో బార్‌ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆయనకు పలువురు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యేల ఒత్తిడితో పోలీసుల వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయలేదంటూ సీసీ ఫుటేజీ విడుదల చేయలేదు.


నలుగురికి తీవ్రగాయాలు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఆ ముగ్గురు వైద్య విద్యార్థులు. అర్ధరాత్రి పూటుగా మద్యం తాగారు. ఒకరు మత్తులోనే అతివేగంగా కారు నడిపి నలుగురు పాదచారులను ఢీకొట్టాడు. మాదాపూర్‌ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన ఎ.నిఖిల్‌రెడ్డి(26), వైజాగ్‌లోని తారకరాంనగర్‌కు చెందిన మెండు తరుణ్‌(24), మహారాణిపేటకు చెందిన గొట్టి ముక్కుల అఖిల్‌(23) ముగ్గురు స్నేహితులు. పీజీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొండాపూర్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ నిఖిల్‌రెడ్డి కారులో  ఇనార్బిట్‌ మాల్‌లోని ఫ్యూజన్‌ పబ్‌కు వచ్చారు. మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి బయలుదేరారు. నిఖిల్‌రెడ్డి కారును నడుపుతూ దుర్గం చెరువు నర్సరీ వద్ద నేపాల్‌కు చెందిన రాహుల్‌ గౌతమ్‌(24), పంకజ్‌ అగ్రహారి, వినోద్‌ నాయక్‌(19), సూరజ్‌ గౌతమ్‌(27)లను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరంతా వలస వచ్చి మాదాపూర్‌ అరుణోదయ కాలనీలో ఉంటున్నారు. నిఖిల్‌రెడ్డిని రక్తంలో మద్యం మోతాదు 116 ఎంజీగా ఉన్నట్లు తేలింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.


భార్యాభర్తలు కన్నుమూత

కోకాపేట్‌కు చెందిన పాల వ్యాపారి దుర్గం రాజు(37)భార్య మౌనిక(28) దంపతులు. గండిపేట్‌లోని బ్యాంకులో నగదు జమచేసేందుకు సోమవారం మధ్యాహ్నం బైకుపై గండిపేట్‌ వచ్చారు. పని ముగించుకుని.. పెట్రోల్‌ పోయించుకున్నారు. అపసవ్యదిశ(రాంగ్‌రూట్‌)లో కోకాపేట్‌ వైపు బయల్దేరారు. వేగంగా వస్తున్న క్వాలిస్‌ వాహనం ఎదురుగా వస్తున్న వారిని ఢీకొట్టి 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. తీవ్రగాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్‌ సంజయ్‌ పూటుగా మద్యం తాగిఉన్నట్లు తేలింది. దంపతులకు పిల్లలు చంద్రిక(11), మణిదీప్‌(5), అనీష్‌(3) ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని