logo

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ.. జడ్పీలో విలీనం

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుడే ఈ విధంగా చేయాలని భావించినా,

Published : 08 Dec 2021 00:51 IST

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుడే ఈ విధంగా చేయాలని భావించినా, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌1 నుంచి రద్దు కానుంది. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో 1999 ఏప్రిల్‌ 1న దేశవ్యాప్తంగా డీఆర్‌డీఏ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నారు. వీటికి కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం నిధులను సమకూర్చుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్రాలు తమ వాటా నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడంతో పథకాల అమలు ఇబ్బందిగా మారింది. దీంతో ఈ వ్యవస్థను రద్దు చేస్తూ, దాని కింద అమలవుతున్న పథకాల బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమలవుతున్న పథకాలను జిల్లా పరిషత్‌లో విలీనం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

తగ్గనున్న కేంద్ర నిధులు..
డీఆర్‌డీఏ రద్దు అనంతరం ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తగ్గనున్నాయి. జిల్లా పరిషత్‌లో విలీనం తరువాత కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణ, బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనే పడుతుంది. ఈ క్రమంలో ఆయా పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను కేంద్రం ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ జీవనోపాధుల పథకం(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద మహిళా స్వయం సహాయక పథకాల సభ్యుల జీవనోపాధి కోసం రుణాలు అందుతున్నాయి. జిల్లాలో 15,131 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 1,59,460 మంది సభ్యులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో స్త్రీ నిధితో పాటు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తున్నారు. జిల్లాలో 2021-22కు గానూ ఇప్పటి వరకు రూ.289.69 కోట్ల రుణాలను అందించారు. 566 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. జాబ్‌కార్డులు 1,92,146 ఉండగా, కూలీలు 4,26,232 మంది ఉన్నారు.

ఉద్యోగుల విలీనమేమీ ఉండబోదు..
జిల్లా పరిషత్‌లో విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో డీఆర్‌డీఏ కింద పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది. జడ్పీలో విలీనమైతే ఉద్యోగులను విలీనం చేస్తారనే అనుమానాలు సిబ్బందిలో ఉన్నాయి. ప్రస్తుతం డీఆర్‌డీఏలో డ్వామా, సెర్ప్‌ విభాగాలు ఉండగా, వాటి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు అదే విభాగాల్లోనే ఉంటారని, వారిని ఇతర శాఖలకు పంపించడం ఉండబోదని తెలుస్తోంది. జడ్పీలో విలీనం అయినప్పటికీ డ్వామా, సెర్ప్‌ విభాగాలు తమ పనిని యధావిధిగా నిర్వహిస్తాయని, అందువల్ల ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని