నవ్వుతూ పలకరించే దంపతులు చనిపోయారని.. ఊరంతా అక్కడికి చేరింది..

అందరితో కలుపుగోలుగా ఉంటూ.. నవ్వుతూ పలకరించే ఆలూమగలు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి ఊరంతా అక్కడకు చేరింది. దహనసంస్కారాలు జరిగేంత వరకూ చుట్టుపక్కల ఏ ఇంట..

Updated : 08 Dec 2021 07:45 IST

ప్రమాదంలో మరణించిన కోకాపేట దంపతులకు వీడ్కోలు

రాజు పిల్లలు చంద్రిక, మణిదీప్‌

ఈనాడు, హైదరాబాద్‌ రాయదుర్గం, నార్సింగి, న్యూస్‌టుడే : అందరితో కలుపుగోలుగా ఉంటూ.. నవ్వుతూ పలకరించే ఆలూమగలు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి ఊరంతా అక్కడకు చేరింది. దహనసంస్కారాలు జరిగేంత వరకూ చుట్టుపక్కల ఏ ఇంట.. పొయ్యి వెలగలేదంటే.. ఆ దంపతులు గ్రామస్థుల మనసులో ఎంతటి ముద్ర వేసుకున్నారనేది అర్థమవుతోంది. సోమవారం మధ్యాహ్నం గండిపేట్‌ సీబీఐటీ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కోకాపేట్‌కు చెందిన దుర్గం రాజు, మౌనిక దంపతులను ఎదురుగా వస్తున్న క్వాలీస్‌ వాహనం ఢీకొట్టింది. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలను కోకాపేట్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే కోకాపేట్‌లోని రాజు నివాసం వద్దకు బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరారు. సాయంత్రం దహన క్రియలు పూర్తయేంత వరకూ.. చుట్టుపక్కల కుటుంబాలన్నీ అక్కడే ఉన్నాయి. కుమారుడు, కోడలు మృతదేహాలు ఇంటికి చేరగానే వృద్ధులైన తల్లిదండ్రుల గుండెలు బాదుకుంటూ విలపించటం అందర్నీ కదిలించింది. సాయంత్రం దంపతుల మృతదేహాలను ఊరేగింపుగా శ్మశానవాటికకు తరలించారు. ఊరంతా కదలి తుది వీడ్కోలు పలికింది.

కోకాపేట్‌లో రాజు ఇంటి వద్ద బంధువుల రోదనలు

ఇంటికి పెద్దదిక్కు
కోకాపేట్‌ మధ్యలో అందమైన ఇల్లు. తండ్రి కిష్టయ్య, తల్లి రేణుకమ్మ. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. రాళ్లు కొట్టి కుటుంబాన్ని పోషించే తండ్రికి చేదోడుగా ఉండేవాడు రాజు. రోజూ ఉదయం 4 గంటలకు నిద్రలేచి పాలు సేకరించటం, ఇల్లిల్లూ తిరిగి పోయటం చేస్తుంటాడు. భార్య మౌనిక నార్సింగిలో పొదుపు సంఘాల గ్రూపు లీడర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రాజు, మౌనిక దంపతులకు ముగ్గురు పిల్లలు. చంద్రిక(11), మణిదీప్‌(05), అనీష్‌(03). ఈ ముసలి తనంలో ఆ పసిపిల్లలను ఎలా పోషించాలో అర్థం కావట్లేదని ఇంట్లో పెద్దలు వాపోయారు. కాంగ్రెస్‌ నాయకుడు జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ఆ ముగ్గురు పిల్లల్ని ఇంటర్‌ వరకూ చదివిస్తానంటూ ముందుకు వచ్చారు.

డ్రైవర్‌కు రిమాండ్‌
మద్యం తాగి నిర్లక్షంగా కారు నడిపి దంపతుల మృతికి కారకుడైన క్వాలిస్‌ డ్రైవర్‌ సంజీవ(30)ను నార్సింగి పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు