Crime News: బంజారాహిల్స్‌ యాక్సిడెంట్‌.. నిందితులు ‘ఆ గంట’ ఎక్కడికెళ్లారు?

బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిరుద్యోగులు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటనకు కారణమైన నిందితులు కారును

Updated : 08 Dec 2021 15:00 IST

కారు ప్రమాద ఘటనలో పోలీసుల ముమ్మర విచారణ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిరుద్యోగులు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటనకు కారణమైన నిందితులు కారును 1.55 గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని పద్మావతి అపార్ట్‌మెంట్‌ వద్ద నిలిపి గంట తర్వాత తిరిగొచ్చారు. ఈ సమయంలో వీరు ఎక్కడికి వెళ్లారు? తెల్లవారుజామున 5 గంటలకు ఓ రాజకీయ పార్టీ నేత నేరుగా బంజారాహిల్స్‌ ఠాణాకు ఎందుకు, ఎవరి కోసం వచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మద్యం తాగి.. సిగరెట్లకు వెళ్లి..

ఘటనలో నిందితులుగా ఉన్న బజార్‌ రోహిత్‌గౌడ్‌, సాయి సోమన్‌ మూడు పబ్బుల్లో మద్యం తాగారు. చివరగా రాత్రి 12.45 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ నుంచి బయటకు వచ్చారు. తర్వాత సిగరెట్ల కోసం జలగం వెంగళ్‌రావు ఉద్యానవనం మీదుగా నాగార్జున సర్కిల్‌ వైపు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో పార్క్‌హయత్‌కి వెళ్లి అక్కడ మద్యం తాగి, భోజనం చేయవచ్చని, విదేశీ సిగరెట్లు దొరుకుతాయని భావించి అక్కడికి వెళ్లే క్రమంలోనే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. 

సీసీ కెమెరాల పరిశీలన..

రాత్రి 1.55 గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 5కు వెళ్లిన రోహిత్‌గౌడ్‌, సాయి సోమన్‌ అంతకుముందే తమ స్నేహితుడికి ఫోన్‌ చేశారు. సెల్లార్‌లో తమ కారును నిలిపి స్నేహితుడు తీసుకొచ్చిన బీఎండబ్ల్యూలో వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని ఘటనా ప్రాంతాన్ని చూసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరిగి వచ్చే క్రమంలో ప్రమాద స్థలంలో పోలీసులు ఉండటంతో మరో దారిలో వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అలా వచ్చిన వారిని గుర్తించిన కానిస్టేబుల్‌, హోంగార్డులు ప్రమాదంలో గాయపడ్డవారికి చికిత్స చేయించాలని కోరడంతో అంగీకరించినట్లు అనుమానిస్తున్నారు. ఈ గంట సమయం ఎక్కడ తిరిగారో తెలుసుకొనేందుకు నాగార్జున సర్కిల్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 3, 2తోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు1, 5లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

వారు ఎందుకు వచ్చారు?

బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం అనంతరం నిందితులు పట్టుబడటం.. వెంటనే కొందరు నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ నాయకుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తన వంతు ప్రయత్నం చేశారు. మరో ఇద్దరు నేతలు సైతం ఫోన్‌ చేసి పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఠాణాకు వచ్చిన నేత ఓ వ్యక్తిని తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

14 రోజుల రిమాండ్‌

నిందితులు బజార్‌ రోహిత్‌గౌడ్‌, సాయి సోమన్‌లను మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరించేందుకు అయిదు రోజుల కస్టడీ కోరుతూ పిటీషన్‌ దాఖలు చేసినట్లు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని