logo
Published : 08/12/2021 03:06 IST

గల్ఫ్‌ ఆశలు.. వీసా మోసాలు

ఉపాధి పేరిట పేద మహిళలకు దళారుల టోకరా

కరిద్దరు కాదు.. 44 మంది మహిళలు. మంగళవారం తొలిసారిగా విమానాశ్రయానికి వచ్చారు. అనుమానం వచ్చిన ఇమిగ్రేషన్‌ అధికారులు తనిఖీ చేసి.. వారంతా రెండు వీసాలతో కువైట్‌ వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఇది కేవలం ఒక ఘటన మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక అవసరాలను అవకాశంగా చేసుకుని దళారులు చెలరేగుతున్నారు. గల్ఫ్‌ దేశాలకు పంపుతామంటూ ఆశ చూపుతున్నారు. వీసా, పాస్‌పోర్టు అన్నీ సమకూర్చుతామంటూ పెద్దఎత్తున నగదు వసూలు చేస్తున్నారు. నకిలీ వీసాలు చేతికిచ్చి మోసం చేస్తున్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూ సుమారు 3500 మంది విదేశాలకు వెళ్తుంటారని అంచనా. వీరిలో 2000 మంది గల్ఫ్‌ దేశాలకు చేరుతున్నారు. వీరిలో చాలామంది విజిటింగ్‌, టూరిజం వీసాలపై వెళ్లి అక్కడే కార్మికులుగా చెలామణి అవుతున్నారు.

అసలేం జరుగుతోందంటే..?
వీసా మాయాజాలంలో కీలక సూత్రధారులు ముంబయి నుంచి వ్యవహారం నడిపిస్తుంటారు. వీరికి గల్ఫ్‌దేశాల సంస్థలు, ట్రావెల్‌ ఏజెంట్లతో ఉన్న పరిచయాలతో అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నట్టు చూపుతూ నకిలీ సంస్థల ద్వారా పత్రాలు తెప్పిస్తారు. వీటిని ఆధారంగా చూపుతూ తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని సబ్‌ ఏజెంట్లను రంగంలోకి దింపుతారు. కువైట్‌, ఖతార్‌, దుబాయ్‌, సౌదీ పంపుతామంటూ పెళ్లీడు వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని బేరసారాలు సాగిస్తారు. రూ.70,000-1,00,000 ఇస్తే మంచి వేతనం, వసతితో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశచూపుతారు. ఈ మాటలు నమ్మి.. చాలా మంది అమాయకులు వీరి వలలో పడుతున్నారు. ఏజెంట్లు వారికి టూరిజం, విజిటింగ్‌ వీసాలు, ఎంప్లాయిమెంట్‌ వీసాలు చేతికిస్తారు. మొదటిది వారు విమానం ఎక్కేచోట, రెండోది విమానం దిగిన తర్వాత అక్కడి అధికారులకు చూపమంటూ ముందుగానే శిక్షణనిస్తారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల పరిశీలనలో రెండు వీసాలు గుర్తించినప్పుడే అసలు గుట్టు బయటపడుతుంది.


హైదరాబాద్‌  ఎందుకంటే..?

2016లో శంషాబాద్‌ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో సౌదీ దేశాలకు బయలుదేరిన 20 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన 8 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌, విమానయాన సంస్థ ఉద్యోగి కూడా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన సూత్రధారి ఆధ్వర్యంలో పనిచేసే ముఠా 4000 మందిని ఇలాగే విదేశాలకు చేరవేసినట్టు నిర్ధారించారు. చెన్నై, దిల్లీ, బెంగళూరు ద్వారా గల్ఫ్‌ చేరే అవకాశమున్నా ఇక్కడికే ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు.. హైదరాబాద్‌ నుంచి తేలికగా విదేశాలకు ఎగిరిపోవచ్చంటూ నిందితుల్లో ఒకరు పోలీసులకు చెప్పడం విస్మయానికి గురిచేసింది.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని