logo

పక్కనున్నా.. వెనుక ఉన్నా జైలుకే!

మద్యం మత్తులో.. రహదారులపై మితిమీరిన వేగంతో నడుపుతూ నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లపై హైదరాబాద్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా కొందరు వాహనదారులు మోతాదుకు

Updated : 08 Dec 2021 10:29 IST

డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాల నేపథ్యంలో పోలీసుల కొరడా  
ఈనాడు, హైదరాబాద్‌

ద్యం మత్తులో.. రహదారులపై మితిమీరిన వేగంతో నడుపుతూ నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లపై హైదరాబాద్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా కొందరు వాహనదారులు మోతాదుకు మించి మద్యం తాగి రేసుగుర్రాల్లా వెళ్తూ ప్రమాదాలు చేసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. వీటిని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు కార్లు, బైకుల్లో మందుబాబులతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితులు, సన్నిహితులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. మోతాదుకు మించి మద్యం తాగి కారులో వేగంగా వెళుతూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో ప్రమాదం చేసి ఇద్దరిని బలిగొన్న రోహిత్‌ గౌడ్‌తో పాటు అతడి పక్కన కూర్చున్న సోమన్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా, వాహనదారుల్లో భయం పెంచేందుకు ఇలా చేస్తున్నారు.

2 నెలల్లో 48 మంది మృతి..
నగరంలో వారాంతాల్లో జరుగుతున్న విందు, వినోదాలు, పబ్బులు, బార్లలో జరిగే పార్టీల్లో మోతాదుకు మించి మద్యం తాగుతున్న కొందరు యువకులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లేప్పుడు రోడ్లపై విన్యాసాలు చేస్తున్నారు. ఆ వేగానికి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో రెండునెలల్లో 48 మంది చనిపోయారు. వీరంతా మద్యం మత్తులో డ్రైవర్లు చేసిన ప్రమాదంతోనే చనిపోయారని నిర్ధారించుకున్న పోలీసులు వారిపై ఐపీసీ 304 పార్ట్‌-2 సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇకపై డ్రైవర్లతో పాటు పక్కన, వెనుక కూర్చున్న వారు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని చెబుతున్నారు.


తప్పును ప్రోత్సహించినట్టే..
- ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, సంయుక్త కమిషనర్‌, పశ్చిమ మండలం

మోతాదుకు మించి మద్యం తాగి బైకులు, కార్లు నడపడం తీవ్రమైన నేరం. మద్యం మత్తులో ఉన్న వాహనదారులు విచక్షణా రహితంగా రోడ్లపై వెళుతూ ప్రమాదాలు చేస్తున్నారు. ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే మోతాదుకు మించి మద్యం తాగి కారు, బైకుల్లో వెళుతూ ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లతో పాటు వారి పక్కన ఉన్న, వెనుక ఉన్నవారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం. మద్యం తాగిన వ్యక్తి వాహనం నడుపుతుంటే పక్కన కూర్చోవడం తప్పును ప్రోత్సహిస్తున్నట్టే. అందుకు శిక్ష అనుభవించాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని