Hyderabad News: వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌ బాడీ.. మృతుడిని గుర్తించిన పోలీసులు

కలకలం సృష్టించిన రాంనగర్‌ డివిజన్‌ ఎస్కార్కే నగర్‌ ప్రాంతంలోని వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ..

Updated : 08 Dec 2021 13:58 IST

హైదరాబాద్‌: కలకలం సృష్టించిన రాంనగర్‌ డివిజన్‌ ఎస్సార్కే నగర్‌ ప్రాంతంలోని వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం కేసులో పోలీసులు ముందడుగు వేశారు. మృతుడు చిక్కడపల్లి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కిశోర్‌గా గుర్తించారు. ఘటనాస్థలంలో లభ్యమైన చెప్పుల ఆధారంగా మృతదేహం కిశోర్‌దిగా తేల్చారు. కిశోర్‌ అదృశ్యంపై 15రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తాగునీటి ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించిన క్రమంలో ఇటీవల అదృశ్యమైన వ్యక్తుల కేసులపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో చెప్పుల ఆధారంగా మృతదేహం కిశోర్‌దేనని నిర్ధరించారు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌ రాంనగర్‌ డివిజన్‌ ఎస్సార్కేనగర్‌ ప్రాంతంలోని జలమండలికి చెందిన 50 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్‌ ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జలమండలి సిబ్బంది ట్యాంకును శుభ్రం చేసేందుకు ఆరుగురు కూలీలను ట్యాంకుపైకి పంపింది. ట్యాంకుపై ఉన్న కూలీలు మూతను తొలగించి లోపలికి దిగుతుండగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు భయంతో కిందికి వచ్చి విషయాన్ని సిబ్బందికి చెప్పారు. వెంటనే జలమండలి సిబ్బంది ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌, డీఐ వెంకన్న, సెక్టార్‌ ఎస్సై శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని జీహెచ్‌ఎంసీ అత్యవసర విభాగం డీఆర్‌ఎఫ్‌ సహాయంతో సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా మృతుని వివరాలు తెలిశాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని