logo

ఎస్‌బీఐలో కాగిత రహితం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఎస్‌బీఐ-ఏడీబీ (వ్యవసాయ అభివృద్ధి సంస్థ) బ్యాంకులో కాగిత రహిత లావాదేవీలను కొనసాగిస్తున్నారు. ఖాతాదారులందరికీ గ్రీన్‌ రిమిట్‌ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ కార్డుతో సమయం ఆదాతో పాటు ప్రతంపై వివరాలు రాయకుండానే

Published : 17 Jan 2022 03:27 IST

ఖాతాదారులకు గ్రీన్‌ కార్డుల జారీ

న్యూస్‌టుడే, పాత తాండూరు, బషీరాబాద్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఎస్‌బీఐ-ఏడీబీ (వ్యవసాయ అభివృద్ధి సంస్థ) బ్యాంకులో కాగిత రహిత లావాదేవీలను కొనసాగిస్తున్నారు. ఖాతాదారులందరికీ గ్రీన్‌ రిమిట్‌ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ కార్డుతో సమయం ఆదాతో పాటు ప్రతంపై వివరాలు రాయకుండానే బ్యాంకులో నగదు జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత జమ చేయాలనుకుంటున్నామో ఆ నగదు, కార్డును బ్యాంకు కౌంటర్‌లో ఇస్తే చాలు.. క్షణాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు.

తీరనున్న ఇబ్బందులు..: కరోనా ప్రభావంతో అన్ని కార్యాలయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకొని.. రాబడిని పెంచుకునేందుకు నూతన ఒరవడిని అమలు చేస్తున్నాయి. కాగితం ధరలు విపరీతంగా పెరగడంతో పాటు వాటి ముద్రణ, రవాణా ఇతర ఖర్చుల నుంచి విముక్తి కలిగేందుకు కాగిత రహితంగా లావాదేవీలు ప్రారంభించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా ఏటీఎం కేంద్రాల్లో ఎలాగైతే నగదును తీసుకుంటామో.. అదే తరహాలో నగదును జమ చేసుకునేందుకు గ్రీన్‌ కార్డును అందుబాటులోకి తెచ్చారు. రూ.20 చెల్లించి బ్రాంచ్‌లో కార్డు తీసుకుంటే, ఆ నంబరును ఖాతాకు అనుసంధానం చేస్తారు. జమ చేసుకునే నగదు, కార్డు ఇస్తే చాలు మన ఖాతాలోకి నగదు వెంటనే చేరవేస్తారు.

అన్ని బ్రాంచిల్లో అమలుకు నిర్ణయం..: జిల్లాలోని 18 రకాల వివిధ బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ ప్రధాన కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరికొన్ని ప్రైవేటు బ్యాంకులు కాగిత రహిత లావాదేవీలకు సన్నాహాలు చేస్తున్నాయి. తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌, పరిగి బ్రాంచ్‌లలో అమలవుతుండగా.. త్వరలో అన్ని శాఖల్లో అమలుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు బ్యాంకుల వద్ద రూ.5- 10 చొప్పున వసూలు చేసి చీటీలను రాసిస్తున్నారని ఖాతాదారుల నుంచి ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఒక్కో బ్రాంచి నుంచి 30శాతం ఖాదారులకు వీటిని జారీ చేశారు. వందల సంఖ్యలో వచ్చే మహిళా సంఘాల సభ్యులు, రైతులు, ఖాతాదారులు, వాణిజ్య, వ్యాపారవేత్తలకు ఇబ్బందులు తీరనున్నాయి.

సమయం వృథా కాదు: రాంబాబు, లీడ్‌ బ్యాంకు మేనేజరు, వికారాబాద్‌

గ్రీన్‌ కార్డుల జారీతో ఖాతాదారులు బ్యాంకు వచ్చి సమయం వృథా కాకుండా సునాయసంగా ఖాతాలో నగదు జమ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ విధానం అవుతోంది. బ్యాంకుల్లో కాగిత రహితంగా మారితేనే బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారులు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సులువైన విధానాన్ని ఖాతాదారులు స్వాగతిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని