logo

రామలింగేశ్వర భూములకు రక్షణేదీ?

దేవాదాయ భూములను కాపాడుతామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు. ఇందుకు ఉదాహరణే పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. పెద్దఉమ్మెంతాల్‌, పూడూరు తదితర గ్రామాల పరిధిలోని వివిధ సర్వే

Published : 17 Jan 2022 03:27 IST

అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని వైనం

న్యూస్‌టుడే, పూడూరు

అటవీశాఖ తీయించిన కందకం

దేవాదాయ భూములను కాపాడుతామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు. ఇందుకు ఉదాహరణే పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. పెద్దఉమ్మెంతాల్‌, పూడూరు తదితర గ్రామాల పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో ఆలయానికి విలువైన భూములు ఉన్నాయి. అప్పట్లో దాతలు స్వామివారి పేరుతో వీటిని అప్పగించారు. ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. పూడూరు పంచాయతీ పరిధి సర్వే నంబర్లు 473, 217, 218, 219 లో 44 ఎకరాల 23 గుంటలు ఉండగా, పెద్ద ఉమ్మెంతాల్‌ పరిధిలో సర్వే నంబర్లు 51, 65లో 23 ఎకరాల 25 గుంటలుంది. భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం అధికారులు ధరణి పోర్టల్‌లో రామలింగేశ్వర స్వామి భూములను పొందుపర్చక పోవటం అనుమానాలకు తావిస్తోంది.

స్థిరాస్తి వ్యాపారంతో..

స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగటంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎకరానికి రూ.రూ.50 లక్షలనుంచి రూ.3కోట్ల వరకు పలుకుతోంది. వ్యాపారులు వీటిపై కన్నేస్తే ఆ భూములు కనుమరుగయ్యేందుకు ఆస్కారం ఏర్పడనుంది. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉండటంతో పాటు హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి కలిగి ఉండటంతో పూడూరు మండలం ప్రాధాన్యత సంచరించుకుంది. ఎంతో మంది సంపన్నుల కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో భూములను కొనుగోలు చేసుకుని వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగరానికి దగ్గరగా ఉండటంతో అందరి కళ్లు పూడూరు మండలం పైనే ఉన్నాయి.

కంచె ఏర్పాటు చేస్తాం అనుమతులు ఇవ్వండి

దేవాలయానికి చెందిన భూములను కాపాడుకునేందుకు పాలకవర్గం ముందుకు వచ్చింది. రామలింగేశ్వర స్వామి ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పాలకవర్గం ఇటీవల దేవాదయశాఖ కమిషనర్‌, జిల్లా అధికారులకు వేర్వేరుగా లేఖ రాశారు. భూములకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టా పాసుపుస్తకాలు రెవెన్యూ శాఖ నుంచి సమకూర్చుకుని కమిటీకి అందజేయాలని కోరారు.


హద్దులు గుర్తించకుండానే..

పూడూరు సర్వే నంబరు 473లోని 12.4 ఎకరాలు దేవాదాయశాఖ రికార్డుల్లో మాత్రమే ఉంది. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. కనీసం హద్దులు కూడా గుర్తించలేదు. సర్వే చేయకపోవటంతో ఎక్కడ ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయనేది సందిగ్ధత నెలకొంది. పక్కనే అటవీ ప్రాంతం కావడంతో, ఆలయ భూములు అందులో కలిసిపోయాయి. హద్దులు గుర్తించకుండానే ఇటీవల అటవీశాఖ అధికారులు చుట్టూ లోతైన కందకాలు తీయిస్తున్నారు. ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉన్నప్పటికి అటవీశాఖ అధికారులు మాత్రం మొత్తం స్థలం మాదే అంటూ ఆక్రమణకు చూస్తున్నారు. గుడివద్ద ఎటువంటి పనులు చేపట్టినా అటవీశాఖ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. పలుమార్లు స్థానికులు, భక్తులు వ్యతిరేకించడంతో మిన్నకుంటున్నా, సమస్య పరిష్కారం కావటం లేదు. పెద్దఉమ్మెంతాల్‌ సర్వేనంబరు 51,65 ోని 23.25 ఎకరాల భూమి ధరణి వచ్చాక అదే గ్రామానికి చెందిన ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల పేర్లతో నమోదయి ఉంది.


సమస్య పరిష్కారానికి కృషి

కిరణ్‌కుమార్‌, తహసీల్దారు, పూడూరు

అప్పట్లో పనిచేసిన కొందరు సిబ్బంది చేసిన తప్పిదంతో భూముల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. కొన్ని ఆన్‌లైన్‌ కాలేదు. ఇటీవల దామగుండం భూముల ఆన్‌లైన్‌ కోరుతూ కమిటీ వారు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు దస్త్రాలు పరిశీలిస్తున్నాం. ఇక్కడున్న ఆధారాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని