logo

కొరవడిన పర్యవేక్షణ..నాణ్యత విస్మరణ!

రేపటిపౌరుల భవితకు బాటలు వేసేందుకు సర్కారు కృషి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అందిపుచ్చుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. వందల మంది విద్యార్థులు.. పదులు సంఖ్యలో సిబ్బంది వసతికి.. బోధన నిమిత్తం చేపట్టిన

Published : 17 Jan 2022 03:27 IST

రూ.కోట్ల పనుల్లో ఇదీ తీరు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

గురుకుల భవనం

రేపటిపౌరుల భవితకు బాటలు వేసేందుకు సర్కారు కృషి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అందిపుచ్చుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. వందల మంది విద్యార్థులు.. పదులు సంఖ్యలో సిబ్బంది వసతికి.. బోధన నిమిత్తం చేపట్టిన భవన సముదాయం పనులు అస్తవ్యస్తంగా కొనసాగడమే ఇందుకు నిదర్శనం. నాణ్యతను పట్టించుకోకపోయినా అడిగేవారు లేకుండా పోయారు. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. నాలుగేళ్లుగా సాగుతుండటపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గురుకుల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగానే సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తాండూరు మండలంలో మైనార్టీ గురుకుల పాఠశాల భవన సముదాయం నిర్మించేందుకు ఏకంగా రూ.18 కోట్లు మంజూరు చేసింది. తాండూరు-చించోళి అంతర్రాష్ట్ర రహదారి జిన్‌గుర్తి గేటు వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో 2018లో భవన నిర్మాణం చేపట్టారు. 600 మంది విద్యార్థుల బోధనకు, వసతికి అనువైన సువిశాలమైన తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నారు. వందల సంఖ్యలో ఏకకాలంలో భోజనం చేసేందుకు వీలుగా భోజనశాల నిర్మిస్తున్నారు. నలభై మందికిపైగా బోధన సిబ్బంది విడిదికి, ప్రిన్సిపల్‌కు సైతం ప్రత్యేక గదుల నిర్మాణం చేపట్టారు. పనులు పూర్తి చేయించే బాధ్యతను టీఎస్‌డీడబ్ల్యూఐడీసీ అధికారులకు సర్కారు కట్టబెట్టింది.

కొలతల్లో తేడాలు..

కొనసాగుతున్న జాప్యం..: భవన నిర్మాణ పనుల్లోనూ జాప్యం నెలకొంది. ప్రహరీ నిర్మాణ పనులు ఇనుప చువ్వలకే పరిమితం చేశారు. ఆరు నెలలక్రితం ప్రారంభించినా ఇప్పటివరకు కేవలం ఇనుప చువ్వలను అమర్చారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలను హైదరాబాద్‌ రహదారి మార్గంలోని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. పనుల్లో వేగం పెంచి పూర్తి చేయిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చే వీలుంటుంది. మే నెలాఖరులోగా భవనాన్ని మైనార్టీ గురుకుల పాఠశాల అధికారులకు అప్పగించేందుకు అధికారులు కృషి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

పనులు: మైనార్టీ గురుకుల భవనం

నిధులు: రూ.18కోట్లు

స్థలం: 2 ఎకరాలు

సామర్థ్యం: 600 మంది విద్యార్థులు

బాధ్యత: టీఎస్‌డీడబ్ల్యూఐడీసీ


పత్తాలేని యంత్రాంగం

దశాబ్దాల మన్నికతో భవన నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించాల్సిన అధికారులు పత్తాలేకుండాపోయారు. మొదట్లో దగ్గరున్న ఏఈలు గతకొన్ని నెలలుగా మోహం చాటేశారు. భవనం పనుల నాణ్యతను గాలికొదిలేశారు. గుత్తేదారు తరఫు సిబ్బంది పర్యవేక్షణలో మేస్త్రీలు పనులు కానిచ్చేస్తున్నారు. ఈక్రమంలో కొన్నిచోట్ల స్తంభాలకు కంకర బయటకు తేలింది. మరికొన్నిచోట్ల పైఅంతస్తుల్లో ఒనదానికొకటి అనుసంధానంగా నిర్మించిన భీమ్‌ల కొలతల్లో తేడాలున్నాయి.


పరిశీలించి చర్యలు: రాజు, డీఈ, టీఎస్‌డీడబ్ల్యూఐడీసీ

జిన్‌గుర్తి గేటు వద్ద మైనార్టీ గురుకుల భవనం పనులను పరిశీలించే ఏఈకి అదనంగా వికారాబాద్‌, మర్పల్లి మండలాల బాధ్యతలు అప్పగించాం. మూడు మండలాల్లో పనుల పర్యవేక్షణకు ఆటంకం ఏర్పడుతోంది. సిబ్బంది కొరత సమస్య ఉంది. గురుకుల పాఠశాల భవనాన్ని పరిశీలిస్తాం. నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షిస్తాం. నాసిరకంగా నిర్మిస్తే ఉపేక్షించం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు