logo

ఉచిత పథకాల పేరిట రాజకీయ అవినీతి

సామాన్య ప్రజలకు ఉచిత విద్య, తాగునీరు, విద్యుత్‌ వంటివి అవసరమని, ఉచిత టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎందుకని వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి 80వ జయంతి సందర్భంగా ‘ప్రజాస్వామ్య వేడుక’(సెలబ్రేటింగ్‌ డెమోక్రసీ)

Published : 17 Jan 2022 05:33 IST

‘ప్రజాస్వామ్య వేడుక’ వెబినార్‌లో ప్రముఖులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సామాన్య ప్రజలకు ఉచిత విద్య, తాగునీరు, విద్యుత్‌ వంటివి అవసరమని, ఉచిత టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎందుకని వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి 80వ జయంతి సందర్భంగా ‘ప్రజాస్వామ్య వేడుక’(సెలబ్రేటింగ్‌ డెమోక్రసీ) పేరుతో ఎస్‌ జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆదివారం వెబినార్‌ నిర్వహించింది. ఉచితం పేరిట కొన్ని ప్రభుత్వాలు, పార్టీలు ఓట్లు కొనుగోలు చేస్తున్నాయని, ఇది రాజకీయ అవినీతి కాదా అని మండిపడ్డారు. దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని, అవినీతి, అధిక వ్యయంతో పాటు కొన్నేళ్లుగా మారిన పరిస్థితులతో ఎన్నిక విధానమే మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్‌ పర్‌మోద్‌ కోహ్లి, ప్రొఫెసర్‌ పురుషోత్తం రెడ్డి, ది సండే గార్డియన్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ పంకజ్‌ వోహ్రా, ఆర్వీ యూనివర్సిటీ ఉప కులపతి వైఎస్‌ఆర్‌ మూర్తి పాల్గొని ప్రసంగించారు.


ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి

- జస్టిస్‌ పర్‌మోద్‌ కోహ్లి, సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

‘‘ప్రజాస్వామ్యాన్ని ఓ వస్తువులా అవమానిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి టెర్రరిస్టులు, ఇతర దేశాల నుంచి ఎలాంటి ముప్పు లేదు. మన చర్యలతోనే దాన్ని బలహీనపరుస్తున్నాం. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాయా లేదా ఆలోచించుకోవాలి..? సామాన్య హక్కుల్ని పరిరక్షించాలి. రూల్‌ ఆఫ్‌ లా అమలవ్వాలి.’’


కుటుంబాల చేతుల్లోకి దేశం

- ఆచార్య కె.పురుషోత్తంరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ

‘‘ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దేశం కొన్ని కుటుంబాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు వంశాల చేతుల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో ఈ విధానం ఉంది. ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించడం వంటి పరిస్థితులు మరోసారి రావాలి.’’


బలమైన ప్రతిపక్షం ఉండాలి

- పంకజ్‌వోహ్రా, ది సండే గార్డియన్‌, మేనేజింగ్‌ ఎడిటర్‌.

‘‘ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం, ప్రశ్నించే గొంతుక లేకపోతే అధికార పార్టీల నిర్ణయాలను ఎదుర్కోవడం కష్టం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 13 నెలల పాటు పోరాడారు. చట్టాలు రద్దు చేసే వరకూ పోరాడి విజయవంతమయ్యారు. అధికారంలో ఉండేవారు ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి.’’


మానవహక్కుల కోసం పోరాడితే వేధింపులు

- వైఎస్‌ఆర్‌ మూర్తి, ఆర్వీ యూనివర్సిటీ వీసీ, బెంగళూరు

‘మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారిని వేధిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా బాలలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం పోరాడుతున్న పీపుల్స్‌ వాచ్‌ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. హర్ష్‌ మందర్‌ సంస్థపై ఈడీ సోదాలు నిర్వహించింది. సిద్ధాంతపరమైన వైరుధ్యాలతోనే ఇలాంటివి జరిగాయి. దర్యాప్తు సంస్థల్ని చట్ట విరుద్ధంగా వినియోగించడం సిగ్గు చేటు’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని