logo

క్రైమ్‌ వార్తలు

ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌,

Published : 18 Jan 2022 02:25 IST

ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం

పాపన్నపేట, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాలు.. కుర్తివాడ గ్రామానికి చెందిన సార సత్యనారాయణ (45) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తరచూ ఈ విషయంలో అతను బాధపడేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఇంట్లో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి సాయంత్రం గ్రామ గేటు శివారులోని దర్గా సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.


పురుగు మందు తాగి యువకుడు..

పాపన్నపేట: ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు మనస్తాపానికి గురైన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. అబ్లాపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు ముమ్మని భిక్షపతి, గుండమ్మ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు ఓంకార్‌ (18) పదో తరగతి చదివి ఇంటి వద్ద తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పొలం పనుల విషయంలో ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ విషయంలో మనస్తాపానికి గురైన ఓంకార్‌ ఇంట్లోని గదిలోకి వెళ్లి పురుగు మందు తాగగా గమనించిన కుటుంబీకులు అతన్ని మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


అనారోగ్యంతో వృద్ధుడు..

రామాయంపేట, న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపిన వివరాలు.. కోనాపూర్‌కు చెందిన కోరె బీరయ్య (75) భార్య గతంలోనే చనిపోగా, కుమారుని వద్దే ఉంటున్నారు. అయితే మూడేళ్లుగా కడుపు నొప్పితో పాటు అనారోగ్య సమస్యలతో బీరయ్య బాధపడుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో శౌచాలయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే ఆయన మరణించాడు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


బావిలో దూకి వృద్ధురాలు..

నిజాంపేట (రామాయంపేట), న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా నిజాంపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బండారు లక్ష్మి (68) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె పోషణ భారమైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానికంగా ఉన్న ఓ పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించడంతో విషయం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని