logo

సూక్ష్మసేద్యం.. పరికరం అందని దైన్యం!

అన్నదాతల ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే సూక్ష్మసేద్యంపై నీలినీడలు అలుముకున్నాయి. జిల్లాలో అసలే భూగర్భ జలాలు అంతంత మాత్రం. పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో వేలాది మందికి బోరు బావులే ఆధారం. వెయ్యి అడుగుల లోతు వరకు

Published : 18 Jan 2022 02:25 IST

పెరగని ధరలు, పట్టుసడలని కంపెనీలు
న్యూస్‌టుడే, పరిగి

విపణిలో కొనుగోలు చేసిన పైపులు

అన్నదాతల ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే సూక్ష్మసేద్యంపై నీలినీడలు అలుముకున్నాయి. జిల్లాలో అసలే భూగర్భ జలాలు అంతంత మాత్రం. పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో వేలాది మందికి బోరు బావులే ఆధారం. వెయ్యి అడుగుల లోతు వరకు కూడా వీటిని తవ్వుకున్నారు. అయినా సరే ఒక అంగుళం మాత్రమే నీరు పడిన బోర్లు వందల కొద్దీ ఉన్నాయి. అంతంత మాత్రంగా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సర్కారు సహకారం అందకుండా పోతోంది. దీంతో రైతులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 27వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిలో 11వేల ఎకరాలు పండ్లతోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో వ్యవసాయం ఆశించిన లాభాలు ఇవ్వకపోవడంతో ఇతర పంటలపై దృష్టి సారించారు. కూరగాయలను పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2.16లక్షల కూరగాయల దిగుబడిని సాధిస్తూ జంటనగర వాసుల అవసరాలను సైతం తీరుస్తున్నారు. 19గ్రామీణ మండలాల్లో ఇప్పటివరకు 3,945 మంది రైతులు బిందు సేద్యం కోసం, 1344 మంది తుంపర పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 24వేల ఎకరాల్లో బిందు, 8వేల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించడంతో చాలా మంది వేరు సెనగ, శనగ, నువ్వులు, కంది, జొన్న, మొక్కజొన్న తదితర రకాలను పండిస్తున్నారు. పెట్టుబడిని తగ్గించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నా పరికరాలు అందక  అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. బడ్జెట్‌ కేటాయింపు లేని కారణంగా, రెండేళ్లుగా బిందు పరికరాలు ఇవ్వడంలేదు. ఏటా ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం తమకు పెంచడం లేదని కంపెనీలు పరికరాలను సరఫరా చేసేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.

తుంపర విధానంలో వేరుసెనగ సాగు

సాగుకు అవరోధమే
బిందు, తుంపర సేద్యంతో కూలీల ఖర్చు తక్కువే. వందలాది మంది యూనిట్ల మంజూరు కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తూ నిరాశ చెందుతున్నారు. కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత కలిగిన రైతులు ఇతరుల వద్ద అప్పు చేసి విపణిలో అధిక ధరలకు కొనుగోలు చేస్తుండగా నిరుపేదలకు తలకుమించిన భారంగా పరిణమించింది. మార్కెట్లో 25పైపుల సెట్టు తుంపర పరికరాలకు రూ.24వేలు. అదే రాయితీపై రూ.5,330కే అందే అవకాశముంది. బిందు సేద్యం ఎకరాకు కూరగాయ పంటలకు రూ.80వేలు, పండ్ల తోటలకు రూ.35వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సగానికి సగం భారం తగ్గిపోనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


కాల్వల ద్వారా తడులు:  చంద్రయ్య,  రంగంపల్లి
ప్రభుత్వం వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని చెప్పింది. దీంతో రెండెకరాల్లో వేరుసెనగ సాగు చేస్తున్నాం. నీటి తడులు ఇచ్చేందుకు ప్రత్యేక కాల్వలను తవ్వాల్సి వస్తోంది.  బోర్లలో నీరు తక్కువగా ఉండటంతో పారిన చోటే మళ్లీ పారుతోంది. పరికరాల కోసం పరిగికి వెళ్లి ఆరా తీస్తే మంజూరు చేయడం లేదని తెలిసింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సత్వరం మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి.


ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
చక్రపాణి, జిల్లా ఉద్యానాధికారి

ఆరుతడి పంటల సాగు క్రమేపీ పెరుగుతోంది. ఈ కారణంగా బిందు, తుంపర పరికరాలకు రైతన్నల నుంచి విపరీతమైన డిమాండ్‌ వస్తోంది. ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకోగా మళ్లీ అవకాశం కోసం అనేక మంది నిరీక్షిస్తున్నారు. ధరల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని