logo

అనుమతులు ఒకచోట.. నిర్వహణ మరోచోట

ఎల్బీనగర్‌ చిరునామాతో ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతి లేకుండానే పెద్దఅంబర్‌పేటకు తరలించింది. ప్రవేశాలు పొందిన విద్యార్థులంతా అక్కడికే రావాలని

Published : 18 Jan 2022 02:24 IST

ప్రైవేటు కళాశాలల ఇష్టారాజ్యం
ఓయూ అధికారుల తనిఖీలలో బట్టబయలు
ఈనాడు, హైదరాబాద్‌

ఓయూలోని అకడమిక్‌ ఆడిట్‌ విభాగం

* ఎల్బీనగర్‌ చిరునామాతో ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతి లేకుండానే పెద్దఅంబర్‌పేటకు తరలించింది. ప్రవేశాలు పొందిన విద్యార్థులంతా అక్కడికే రావాలని సూచించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పరిస్థితి.


* మరో కళాశాల యాజమాన్యం సిద్దిపేటలో కళాశాల ఏర్పాటుకు అనుమతి ఉంది. నగరంలోని చైతన్యపురికి బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అనుమతులు రాకుండానే తరగతుల నిర్వహణ చేపట్టారు.

స్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పలు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఓయూ పరిధిలో 913 అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయి. ఇందులో 458 కళాశాలలు ప్రైవేటు విభాగంలో పనిచేస్తున్నాయి. వీటిలో అధికంగా డిగ్రీ కోర్సులనే నిర్వహిస్తున్నాయి. కళాశాల ఏర్పాటు విషయంలో లీజు డీడ్‌, చిరునామా ఎంతో కీలకం. అయితే, కళాశాల నిర్వహణ ఒకచోట.. చిరునామాలు మరోచోట అన్నట్లుగా పరిస్థితి మారింది. ఓ కళాశాల యాజమాన్యం రంగారెడ్డి జిల్లా అడ్రస్‌ పెట్టి.. దిల్‌సుఖ్‌నగర్‌లో నడిపిస్తున్నారు. మరో కళాశాల యాజమాన్యం శామీర్‌పేటలో అనుమతి తీసుకుని అల్వాల్‌, ఓల్డ్‌ అల్వాల్‌లో రెండు బ్రాంచీలు ప్రారంభించడంతో ఇటీవల ఓయూ అధికారులు జరిమానా విధించారు. మరో ప్రముఖ కళాశాల యాజమాన్యం రామంతాపూర్‌లో కళాశాల ఏర్పాటుకు అనుమతి తీసుకుని హబ్సిగూడలో నిర్వహిస్తోంది. ఇలాంటి చర్యలతో విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

లీజు గడువు ముగిసినా..
గత రెండేళ్లుగా కరోనా పరిస్థితుల దృష్ట్యా ఓయూ అధికారులు తనిఖీలు చేపట్టడం లేదు. దీనివల్ల కళాశాల యాజమాన్యాలది ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. వాస్తవానికి కళాశాలలు చిరునామాలు మార్చుకోవాలంటే.. ముందుగా ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసుకోవాలి. ఓయూ అధికారులు తనిఖీ చేసి నిరభ్యంతరపత్రం జారీ చేస్తారు. అద్దె భవనాల్లో కొనసాగుతుంటే..పదేళ్లకు లీజు డీడ్‌ సమర్పించాలి. ఇవేమీ లేకపోయినా..యథేచ్ఛంగా కళాశాలలను నడిపిస్తున్నారు. ఇటీవల ఓయూ ఆడిట్‌ సెల్‌ అధికారులు డిగ్రీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు కళాశాలలు లీజు గడువు ముగిసిన భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తేలింది. మరికొన్ని కళాశాలలు విశ్వవిద్యాలయ అనుమతి లేకుండా అక్రమంగా వేరొక ప్రదేశానికి తరలించి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని కళాశాలలు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి భవనాల ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లు(ఈసీలు) తీసుకుని 15 రోజుల్లోగా సమర్పించాలని ఓయూ ఆదేశించింది. అప్పుడే 2021-22 సంవత్సరానికి ప్రావిజనల్‌ అఫిలియేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


చర్యలు తీసుకుంటాం:
ప్రొ. కె.శ్యామల, అకడమిక్‌ ఆడిట్‌ సంచాలకురాలు, ఓయూ

లీజుడీడ్లు సమర్పించాలని కళాశాలలను ఆదేశించాం. పత్రాలు సవ్యంగా లేకపోతే చర్యలు తప్పవు. నిర్దేశిత గడువులోగా ఈసీలు సమర్పించాలని చెప్పాం. తనిఖీలకు షెడ్యూల్‌ సిద్ధం చేసుకుంటున్న దశలో కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఆగిపోయాం. అందుకే ఈసీలు పరిశీలించి ప్రావిజనల్‌ అఫిలియేషన్‌ ఇవ్వాలని నిర్ణయించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని