logo

పాఠాలకే పరిమితం.. ఆటల సాధనకు దూరం!

పాఠశాల స్థాయిలో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దేందుకు వ్యాయామ తరగతుల నిర్వహణకు సమయసారిణి ఖరారు చేశారు. క్రీడా సాధన..ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం..ఉల్లాసం నింపే లక్ష్యంగా వీటిని నిర్వహించాలి.

Published : 19 Jan 2022 02:43 IST

బడుల్లో కొరవడిన సౌకర్యాలు
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

కరణ్‌కోటలో ప్రభుత్వ పాఠశాల మైదానం

పాఠశాల స్థాయిలో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దేందుకు వ్యాయామ తరగతుల నిర్వహణకు సమయసారిణి ఖరారు చేశారు. క్రీడా సాధన..ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం..ఉల్లాసం నింపే లక్ష్యంగా వీటిని నిర్వహించాలి. బడుల్లో మైదానాల్లేక, వ్యాయామ ఉపాధ్యాయుల కొరత కారణంగా చిన్నారులు కసరత్తుకు దూరమవుతున్న వైనంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో రెండు వ్యాయామ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ తప్పనిసరి చేసింది. క్షేత్ర స్థాయిలో చాలావరకు సదుపాయాల్లేక, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోచక ఆటలకు అందనంత దూరంగా ఉంటున్నారు. ఆసక్తి ఉన్నా అసౌకర్యాలతో సాధన చేయలేకపోతున్నారు. శిక్షకులులేక క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడం గగనంగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల వారు ఉన్నప్పటికీ అనువైన మైదానాలు లేవు. ఇరుకైన తరగతి గదుల్లో పాఠాల బోధనకే పరిమితం చేస్తున్నారు.  

భవిష్యత్తుపై ప్రభావం: వ్యాయామ తరగతుల నిర్వహణ వల్ల విద్యార్థులు శారీరక దేహదారుఢ్యాన్ని కలిగి ఉండేందుకు తోడ్పడుతుంది. దీంతో విద్యార్థులు చురుకుగా ఉండేందుకు దోహదపడనుంది. బడికి క్రమం తప్పకుండా హాజరయ్యేందుకు, ఉల్లాసంగా ఉండేందుకు వీలుంటుంది. అందుకు భిన్నంగా విద్యార్థులను వ్యాయామానికి దూరం చేయడంతో దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి. భవిషత్తులో ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు పొందినా వ్యాయామానికి పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మూడు పదుల వయసులోనే వ్యాధులు చుట్టుముట్టేందుకు దారితీస్తున్నాయి. చిన్న సమస్యలకు, ఒడిదుడుకులను ఎదుర్కొనలేక వెనకబడుతున్నారు. ఉద్యోగం, కుటుంబంలోని సమస్యలను తట్టుకుని ఎదురొడ్డకుండా కుంగుబాటుకు గురవుతున్నారు.

జాడలేని క్రీడా సామగ్రి: గతంలో పాఠశాలలకు ప్రభుత్వం, దాతలు క్రీడా సామగ్రిని సమకూర్చేవారు. క్రమంగా విద్యాశాఖ ద్వారా సరఫరా నిలిచిపోయింది. పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు అందజేస్తున్న సర్కారు ఆటల సామగ్రి సరఫరాను విస్మరించింది. పాఠశాలలకు వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, చెస్‌, క్రికెట్‌ బ్యాట్‌లు, బంతులు, స్కిప్పింగ్‌ రోప్‌లు వంటివి సమకూర్చితే సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటల్లో రాణించేందుకు, వారిలో దాగివున్న క్రీడా ప్రతిభను చాటేందుకు, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడనుంది. గతంలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో గ్రామాలు, పట్టణాల్లో పలువురు దాతలు ముందుకొని బడులకు సామగ్రిని ఉచితంగా అందించే వారు. రానురాను తగ్గిపోతోంది. ప్రభుత్వం పాఠశాలల్లో మైదానాలను అందుబాటులోకి తెచ్చేందుకు, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులను నియమించేందుకు దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.


కొన్ని ఉదాహరణలు

* తాండూరు మండలం చెంగోల్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో ఐదు గ్రామాలకు చెందిన 300లకుపైగా విద్యార్థులు చేరారు. వీరందరికీ ఆటలపై ఆసక్తి ఉన్నా,  మైదానంలో మట్టి, బండరాయితోకూడిన పెద్దఎత్తున గుట్ట ఉంది. తరగతి గదుల ముందు అరకొర ఖాళీ స్థలం ఉండగా ట్యాంకులను నిర్మించారు.

* తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాలతోపాటు పట్టణంలోని వేలాది మంది విద్యార్థుల క్రీడా సాధనకు, పోటీలకు చిన్నమైదానం(మినీస్టేడియం) నిర్మించారు. 2016లో తాండూరు రెవెన్యూ డివిజన్‌గా అవతరించడంతో అప్పట్లో చిన్నమైదానాన్ని ఆర్డీఓ కార్యాలయంగా మార్చేశారు.

* పెద్దేముల్‌ మండలంలో కందనెల్లి, తట్టెపల్లి, ఇందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడలకు మైదానాలు అందుబాట్లో ఉన్నా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు.

* దౌల్తాబాద్‌ మండలంలో ఆరు ఉన్నత పాఠశాలలు ఉండగా, మూడు పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు.

* తాండూరు పట్టణంలోని నంబర్‌ వన్‌ పాఠశాలలో జిల్లాలోనే అత్యధికంగా 756 మంది విద్యార్థులు ఉండగా వీరందరికి ఆటలు ఆడించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. పక్కనే ఉన్న ఉర్దూ మాధ్యమ బడిలోనూ ఇదే పరిస్థితి.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 1,075
విద్యార్థులు: 90వేలు
మైదానాల్లేని బడులు: 400లకుపైగా
వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు: సుమారు 100

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని