logo

పెరటి కోళ్ల పెంపకం.. ఆదాయ మార్గం

పెద్దగా పెట్టుబడి ఖర్చు లేకుండా ఆదాయం..ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకేం కావాలి. ఇదేంటి అనుకుంటున్నారా! పెరటి కోళ్ల పెంపకంతో చేకూరే ప్రయోజనాలివి. ఈ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇందులో

Published : 19 Jan 2022 02:43 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌టౌన్‌

మహిళా సంఘం సభ్యులు

పెద్దగా పెట్టుబడి ఖర్చు లేకుండా ఆదాయం..ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకేం కావాలి. ఇదేంటి అనుకుంటున్నారా! పెరటి కోళ్ల పెంపకంతో చేకూరే ప్రయోజనాలివి. ఈ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఎంపికైన మహిళా సంఘాల సభ్యులకు కోడి పిల్లల కొనుగోలుకు రుణాలు ఇస్తారు. వీటిద్వారా స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటూనే, గుడ్లు, మాంసంతో పౌష్టికాహారం కూడా అందించవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు 49,536 ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో 17,603 సంఘాలు కొనసాగుతున్నాయి. ఆయా సంఘాల్లో 8.05లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రతినెలా పొదుపుతోపాటు తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం తిరిగి చెల్లింపులు చేస్తున్నారు. కోళ్ల పెంపకానికి కూడా స్త్రీనిధి రుణాలు ఇస్తుండటంతో మహిళల ఆర్థిక అభ్యున్నతికి బాటలు పడనున్నాయి.

రుణ సదుపాయం.. వాయిదాలు
100కోళ్ల యూనిట్స్‌(4-6వారాల కోళ్లు) కొనుగోలు, పోషణకు రూ.22,000 రుణంగా అందిస్తారు. 50కోళ్ల యూనిట్‌కు అయితే రూ.12,500. వార్షిక వడ్డీ 11శాతంతో కలిపి 24 నెలసరి వాయిదాలతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పెరటి కోళ్ల మదర్‌ యూనిట్‌(కోడి పిల్లల పెంపకం కేంద్రాలు)కు కూడా స్త్రీనిధి ద్వారా రుణం అందజేస్తారు. యూనిట్‌ విలువ రూ.2.91లక్షలు ఉంటుంది. నెలకు రూ.6,400 చొప్పున 60 నెలసరి వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించాలి.


పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేలా..

శుసంవర్దక శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కోళ్ల సంఖ్య 30లక్షల వరకు ఉంది. కోడి మాంసం, గుడ్ల అవసరాలను ఇవి తీర్చలేకపోతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి సరఫరా చేసుకుంటున్నారు. ధర ఎక్కువగా ఉండటంతో పేదలు కోడి మాంసం, గుడ్లను ఆహారంలో తీసుకోలేని పరిస్థితి. దీంతో పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆదాయం లేకపోవడం, మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రుల ఖర్చులు భరించే స్థోమతలేక పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. వీరి ఇబ్బందులు తీర్చాలన్న లక్ష్యంతో పెరటికోళ్ల పెంపకం దిశగా మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.


సద్వినియోగం చేసుకోవాలి
మోహన్‌రెడ్డి, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్‌

పెరటి కోళ్ల పెంపకానికి ఇస్తున్న రుణసదుపాయాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. కోళ్ల పెంపకంతో ఇంటిల్లిపాదికి పౌష్టికాహారం అందుతుంది. ఇంటి అవసరాలకు పోగా మిగిలిన గుడ్లు, కోళ్ల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పెరటి కోళ్ల పెంపకంతోనే సాధ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని