logo

విధుల్లో ఉంటాం..వీధుల్లోకి వెళ్లలేం

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), జలమండలితో పాటు మరికొన్ని కీలక విభాగాల్లోని అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోకి

Published : 19 Jan 2022 04:18 IST

కొవిడ్‌ నేపథ్యంలో కీలక విభాగాల్లో అభ్యర్థనలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), జలమండలితో పాటు మరికొన్ని కీలక విభాగాల్లోని అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయడానికి భయపడుతున్నారు. ఒకరో ఇద్దరో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి తిరిగి కార్యాలయానికి వచ్చే సమయంలో కరోనా బారినపడితే చాలు.. వారి వల్ల కార్యాలయంలోని పదుల సంఖ్యలోని ఉద్యోగులకు మహమ్మారి సోకుతోంది. దీంతో కొద్ది రోజులపాటు క్షేత్రస్థాయి విధులకు తమను దూరం ఉంచాలని అనేకమంది ఉద్యోగులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీలో గత వారం రోజుల్లో ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్‌, ఇతరత్రా అన్ని కార్యాలయాల్లోని 100 మందికిపైగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఇందులో అత్యధికంగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. దీంతో ఈ విభాగంలోని సిబ్బంది అనేకమంది కొన్ని రోజులపాటు విధుల్లోకి రావడానికి కూడా ఇష్టపటడం లేదు. అనేక ప్రాంతాల్లో కరోనా సోకిన వ్యక్తులు మాస్కులను ఇతరత్రా వస్తువులను నడిరోడ్డు మీదే పడేస్తున్నారు. ఉదయమే వీటిని ఊడ్చే సమయంలో వాటిని పట్టుకోవడంతో కొవిడ్‌ బారినపడుతున్నారు. జలమండలిలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌, చీఫ్‌ జనరల్‌మేనేజర్‌తోపాటు కీలకమైన అధికారులకు వైరస్‌ సోకినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా పర్యవేక్షిస్తున్న 25 మంది ఇప్పటి వరకు బాధితులవగా ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టరేట్లపై మూడో దశ ప్రభావం కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఇంజినీర్లు కూడా పలువురు ఐసొలేషన్‌లో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని