logo

చేరువలోపాలన..వినేవారు లేక వేదన!

పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

Published : 20 Jan 2022 01:46 IST
అందుబాటులో ఉండని అధికారులు
కబ్జాకు గురైన కాలువ

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఒక వేళ వారికి వివరించినా పరిష్కారం విషయంలో శ్రద్ధ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, మట్టి తవ్వకాలు, ఇసుక తరలింపు, పట్టాపాసు పుస్తకాలు అందకపోవడం వంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాఖల వారీగా ప్రస్తుత పరిస్థితిపై కథనం.

ఉపాధ్యాయుల గెర్హాజరుపై చర్యలేవి?

భావిపౌరులకు చదువు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అనధికారికంగా విధులకు డుమ్మాకొడుతున్నారు. వారానికి ఒక రోజు వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒకే రోజు 18 మంది ఉపాధ్యాయులు విధులకు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తించారు. అయినా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బషీరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఈ ఉపాధ్యాయుడు మాకు వద్దు, పాఠశాలకు రాడు, పాఠాలు చెప్పరని విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా, సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు శూన్యం. దీంతో మిగతా సిబ్బంది అదే తీరున వ్యవహరిస్తున్నారు.

అటకెక్కిన సమీక్షలు: వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై నిరంతరం పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోవడం లేదని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కింది స్థాయి సిబ్బందికి మేం చెప్పేది చెబుతాం. జిల్లా ఉన్నతాధికారులు కనీసం ఒక సారైనా మాట్లాడితే అప్రమత్తంగా వ్యవహరిస్తారని అంటున్నారు. రెవెన్యూ, జిల్లా గ్రామీణాభివృద్ధి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌, వ్యవసాయ అనుబంధ రంగాలు, జలవనరులు, వైద్యారోగ్య, విద్యుత్తు, తదితర శాఖలపై నెలలుగా సమీక్షా సమావేశాలు లేవంటున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో దశాబ్దాల కిందట నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 100 నుంచి 150 మంది అర్జీలు సమర్పిస్తున్నారు. సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.

కలెక్టరేట్‌లో అర్జీదారులు

కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులు: వికారాబాద్‌ ఆర్డీవో దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్లే ఆయన వెళ్లారని చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశించగా, నిబంధనలకు విరుద్ధంగా చేయలేనని తెగేసి చెప్పిన ఆర్డీఓ, చివరకు ఆ అధికారి ఉన్నంత వరకు నేను విధులకు హాజరు కాను అంటూ సెలవుపై వెళ్లిపోయారు. మరో తహసీల్దార్‌ను సైతం వేధింపుల వేడి తాకింది. ఉన్నతాధికారి సహాయకుడు ఓ దస్త్రం పంపించాలని చెప్పడంతో. వివాదం మొదలైంది. పంపించమంటే ఇప్పటి వరకు ఉన్న పెండింగ్‌ ఫైల్స్‌ మొత్తం పంపిస్తానని సమాధానం ఇచ్చారని తెలిసింది.

కబ్జాకు గురవుతున్నా..: జలవనరుల శాఖ పరిధిలో 1,127 చెరువులు, 9 ప్రాజెక్టులున్నాయి. పంచాయతీ, పురపాలక సంఘాలకు మరికొన్ని నీటి వనరులు ఉన్నాయి. సాగు, వరద కాల్వలు వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించాయి. అయితే వీటిల్లో ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవట్‌), బఫర్‌ జోన్‌, శిఖం భూములు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల వద్ద ముడుపులు తీసుకుని జలవనరుల శాఖాధికారులు ఎన్‌ఓసీలు (నిరభ్యంతర పత్రం) జారీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఫిర్యాదు వచ్చినా ఉన్నతాధికారులు మిన్నకుంటున్నారని సమాచారం.

 


ఆగని అక్రమ రిజిస్ట్రేషన్ల్లు

తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి అక్రమ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బాధితులు ఫిర్యాదు చేసినా ఇటువంటివారిపై చర్యలు కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిని బాధ్యులు చేస్తున్నారు. వికారాబాద్‌, మోమిన్‌పేట, ధారూర్‌, పరిగి, పూడూరు, తదితర మండలాల్లో ఈ తరహా వ్యవహారాలు జోరుగా నడుస్తున్నాయి. కాసులకు కక్కుర్తిపడి రెవెన్యూ ఉద్యోగులే అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు కార్యాలయ సిబ్బందే తయారు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నా, ఉన్నతాధికారుల్లో చలనం కనిపించడం లేదు. ఫలితంగా రూ.కోట్ల విలువైన భూములను అమాయకులు కోల్పోతున్నారు.


కొనసాగుతున్న ధరణి వెతలు

భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం వచ్చిన ధరణి పోర్టల్‌లో పొరపాట్లను సరిచేయడంలేదు. నిషేధిత, జీపీఏ, సక్సేషన్‌, ఇతర 30 రకాల ఆప్షన్లు ఇచ్చామని సర్కారు ప్రకటిస్తున్నా, అమలులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాదాపు 13 వేల ఆన్‌లైన్‌ దరఖాస్తులను పూర్తి చేశామని కలెక్టర్‌ చెబుతున్నప్పటికీ వాటన్నింటిని ఎటువంటి కారణం చూపించకుండా తిరస్కరించారని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ ఈసేవా కేంద్రాలకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఇదే తరహా సమస్యలపై హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల వ్యక్తులు వస్తే క్షణాల్లో పరిష్కారమవుతున్నాయని, పేదలంటేనే పనులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఓ ఉన్నతాధికారి సహాయకుడిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికి లెక్కగట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని రెవెన్యూ సిబ్బందే పేర్కొనడం గమనార్హం. రాజకీయ నాయకుల పనులను దగ్గరుండి చక్కదిద్దుతున్నారని సమాచారం. సమస్యల పరిష్కారానికి సామాన్యులు కలెక్టర్‌ ఛాంబర్‌ ముందు ఆందోళనకు దిగుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని