logo

ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఐపీ సేవలు

రాష్ట్రంలోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల సేవలు పునరుద్ధరించేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆయుష్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అన్వర్‌ అన్నారు. బుధవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఆయుర్వేద ఆస్పత్రుల వైద్యులతో

Published : 20 Jan 2022 01:46 IST


వివరాలు వెల్లడిస్తున్నఅన్వర్‌, పక్కన రుక్సానా, రవినాయక్‌

తూప్రాన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల సేవలు పునరుద్ధరించేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆయుష్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అన్వర్‌ అన్నారు. బుధవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఆయుర్వేద ఆస్పత్రుల వైద్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఆయుర్వేద ఆస్పత్రులకు పునర్‌వైభవం తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గతంలో ఇన్‌పేషంట్లకు సేవలు అందించి, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆయా ఆస్పత్రుల్లో తిరిగి వైద్య సేవలను ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిని పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకొని ఇక్కడే సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో తూప్రాన్‌లో వెల్‌నెస్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందులో ప్రత్యేక షెడ్డును నిర్మించి యోగాతో పాటు మానసిక ప్రశాంతత కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. గతంలో మెదక్‌ జిల్లా హైదరాబాద్‌ పరిధిలో ఉండగా ప్రస్తుతం వరంగల్‌ జోన్‌కు మారిందన్నారు. రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వచ్చే వారంలో తూప్రాన్‌లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వరంగల్‌ ఆర్‌డీడీ రవినాయక్‌, తూప్రాన్‌ పురపాలిక ఛైర్మన్‌ బొంది రవీందర్‌గౌడ్‌, వైస్‌ ఛైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, తూప్రాన్‌ ఆయుర్వేద వైద్యురాలు రుక్సానా, సిబ్బంది వెంకటేశ్‌, సురేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని