logo

నేర వార్తలు

వేడినీళ్ల బకెట్‌లో పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారి మృతిచెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఠాణా పరిధిలోని శ్రీరాంనగర్‌ ప్రాంతానికి చెందిన చిన్నారి షేక్‌ ఫయాజ్‌(8) స్థానికంగా ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.

Updated : 20 Jan 2022 02:57 IST
వేడినీళ్ల బకెట్‌లో పడిన చిన్నారి మృతి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వేడినీళ్ల బకెట్‌లో పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారి మృతిచెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఠాణా పరిధిలోని శ్రీరాంనగర్‌ ప్రాంతానికి చెందిన చిన్నారి షేక్‌ ఫయాజ్‌(8) స్థానికంగా ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9న తల్లి చిన్నారి కోసం బకెట్‌లో నీరు పోసి హీటర్‌ పెట్టింది. ఇంట్లో ఆడుకుంటూ బకెట్‌ వద్దకు వెళ్లి అందులో పడిపోయాడు. కేకలు వేయడంతో తల్లి చేరుకొని బయటకు తీసింది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

చేగుంట, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. వడియారం గ్రామానికి చెందిన మాదరబోయిన సుగుణ (50) భర్త సిద్ధిరాములు గతంలోనే మృతిచెందాడు. ఈ క్రమంలో ఆమె కూతురు శ్యామల మేడ్చల్‌లో రైల్వే శాఖలో పనిచేస్తూ అక్కడే ఉంటుండడంతో వడియారంలో సుగుణ ఒంటరిగా ఉంటున్నారు. కాగా బుధవారం ఉదయం సుగుణ తన ఇంటి శౌచాలయం వద్ద మృతిచెంది ఉండడం గమనించిన ఇరుగుపొరుగు వారు సమాచారాన్ని శ్యామలకు తెలియజేశారు. ఆమె వచ్చి చూసి, తల్లి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


బురదలో పడి ఊపిరాడక ఒకరు..

కౌడిపల్లి, న్యూస్‌టుడే: పొలం గట్టుపై నుంచి జారి బురదలో పడి ఊపిరాడక ఒకరు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు (50) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పొలం వద్దకు వెళ్లగా గట్టుపై నుంచి జారి బురదలో పడిపోవడంతో నోట్లోకి, ముక్కులోకి బురద చేరిపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. సాయంత్రం పొలానికి వెళ్లిన అతని తమ్ముడి కూతురు కావ్యశ్రీ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికి నర్సింహులు విగతజీవిగా కనిపించాడు. బుధవారం మృతుడి భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


భర్తకు పాజిటివ్‌.. భార్య అదృశ్యం

కార్ఖానా, న్యూస్‌టుడే: భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండగా.. ఇంట్లోకి సామాన్లు కొనేందుకు వెళ్లిన భార్య అదృశ్యమైంది. తిరుమలగిరి ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. సీఐ శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన మాధవి(33), మనోహర్‌లు దంపతులు. ఇద్దరు ప్రైవేట్‌ ఉద్యోగులు. కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇల్లరికం వచ్చాడు. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. ఈనెల 13న మనోహర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఈనెల 16న మధ్యాహ్నం మాధవి మటన్‌ తెస్తానని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త ఆమె మొబైల్‌కు ఫోన్‌ చేయగా ఎత్తలేదు. ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన అతను తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని