logo

సంక్షిప్త వార్తలు

ఒమిక్రాన్‌ విజృంభన ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ నెలాఖరు వరకూ విద్యా సంస్థలు బంద్‌ ప్రకటించడంతో పాటు కోచింగ్‌ సెంటర్లు మూత పడడంతో నగరంలో సిటీ బస్సు ప్రయాణాలు 20-30 శాతం తగ్గాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Published : 20 Jan 2022 03:11 IST

ఆర్టీసీని వీడని కరోనా కష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ విజృంభన ఆర్టీసీ సిటీ బస్సు ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ నెలాఖరు వరకూ విద్యా సంస్థలు బంద్‌ ప్రకటించడంతో పాటు కోచింగ్‌ సెంటర్లు మూత పడడంతో నగరంలో సిటీ బస్సు ప్రయాణాలు 20-30 శాతం తగ్గాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎంఎంటీఎస్‌ రైళ్లలోనూ ప్రయాణికులు గణనీయంగా తగ్గారు. పస్తుతం కొన్ని సంస్థలు ఇంటి నుంచే పని చేసుకోడానికి అనుమతి ఇవ్వడంతో ప్రైవేటు వాహనాల రాకపోకలు తగ్గాయి. ఆటోలు, క్యాబ్‌లు కూడా డిసెంబరు నాటి పరిస్థితిని అంచనా వేస్తే సగానికి సగం తగ్గినట్టు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి కావడంతో సిటీ బస్సులు పూర్తి స్థాయిలో నడపడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలోనే బూస్టర్‌ డోస్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.


ఎన్‌కౌంటర్‌లో గాయపడిన జవాన్‌కు డీజీపీ పరామర్శ

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ములుగు జిల్లా వెంకటాపురం కర్రిగుట్టల ఎన్‌కౌంటర్‌లో గాయపడిన గ్రేహౌండ్స్‌ జవాను సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం తీవ్రంగా గాయపడిన జవాను మధును హుటాహుటిన సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించారు. తూటా ఆయన కుడి చేయిని చీల్చుకుంటూ ఛాతీలోకి వెళ్లినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం ఆయన ఛాతీలో ఉన్న బుల్లెట్‌ను తొలగించేందుకు శస్త్ర చికిత్స చేసినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వివరించాయి. మంగళవారం రాత్రి డీజీపీ మహేందర్‌రెడ్డి జవానును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. ఆయనతోపాటు ఐజీ ప్రభాకర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ ఉన్నారు.


పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్‌కు యాప్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పెంపుడు జంతువుల వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ, పురపాలక శాఖ ప్రత్యేక యాప్‌ రూపొందిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ వెల్లడించారు. వచ్చే నెలలో దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బుధవారం ట్వీట్‌ చేశారు. యాప్‌లో యజమాని ప్రాథమిక వివరాలు నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ సులభంగా పూర్తి చేయొచ్చని తెలిపారు. నోయిడాలో పెంపుడు జంతువుల్ని తప్పనిసరిగా ‘పెట్‌ రిజిస్ట్రేషన్‌ యాప్‌లో’ నమోదు చేయాలి అని ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ను అర్వింద్‌కుమార్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.


పేద బ్రాహ్మణులకు ఉచిత వసతి, భోజనం

కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆసరా లేని పేద బ్రాహ్మణులకు ఉచిత వసతి, భోజనం కల్పించనున్నట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్‌, బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌ శర్మ తెలిపారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారికి అవసరమైన వస్తువులు, వైద్య సేవలు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఈ నెల 25 లోపు వాట్సప్‌ నంబరు: 97016 09689 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


జిల్లా న్యాయస్థానంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన భవన సముదాయంలో ఆన్‌లైన్‌లోనే కేసులు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయవాదుల సౌకర్యార్థం నూతనంగా కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయస్థానం ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.తిరుపతి ఆదేశాల మేరకు అధికారులు బుధవారం న్యాయ సేవా సదన్‌లో కంట్రోల్‌ రూంను అందుబాటులోకి తెచ్చారు. న్యాయవాదులకు ఇంటి వద్ద అంతర్జాల ఇబ్బందులు ఎదురైతే.. ఇక్కడకొస్తే కోర్టుతో అనుసంధానం చేసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు అవకాశం కల్పిస్తారు. స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తోటపల్లి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు ఎ.అనంతసేనారెడ్డి కంట్రోల్‌ రూం పనితీరు పరిశీలించి, న్యాయమూర్తి తిరుపతికి ధన్యవాదాలు తెలిపారు.


20, 21 తేదీల్లో అంతర్జాలం వేదికగా చిత్ర కళాఖండాల వేలం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రెండు రోజులపాటు అంతర్జాలం వేదికగా చిత్ర కళాకృతుల వేలం నిర్వహించనున్నట్లు బంజారాహిల్స్‌లోని డిరివాజ్‌ అండ్‌ ఐవ్స్‌ సంస్థ స్పష్టం చేసింది. ఈనెల 21, 22 తేదీల్లో ఈ వేలం కొనసాగుతుందన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో కళాకారులను ఆదుకునేందుకు, వారి ప్రతిభను చాటిచెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. జామినీరాయ్‌, ఎన్‌.ఎస్‌.బింద్రే, ఎస్‌హెచ్‌ రజా, ఎఫ్‌ఎన్‌.సౌజా, ఎంఎఫ్‌.హుస్సేన్‌, వీఎస్‌.గైతోండే, జహంగీర్‌ సబావాలా, అక్బర్‌ పదంసి, ప్రభాకర్‌ బర్వే, గణేష్‌ తదితర ప్రముఖ చిత్రకారులకు చెందిన 30కిపైగా అపురూప చిత్రా కళాఖండాలను అంతర్జాలం వేదికగా బిడ్డింగ్‌ ద్వారా కళాపోషకులు ఎంపిక చేసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని