logo

మీసంమెలేస్తున్న మోసం!

రూ.4,336 కోట్లు.. మహా నగరం అడ్డాగా గతేడాది ఆర్థిక నేరగాళ్లు సామాన్యుల నుంచి కాజేసిన సొమ్ము. ఇది కేవలం పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిర్ధారించిన సొత్తు మాత్రమే. మాయగాళ్ల చేతిలో పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకోలేని బాధితులు వేలల్లో ఉంటారని అంచనా.

Published : 20 Jan 2022 04:15 IST

మహా నగరిలో కొత్త తరహా ఆర్థిక నేరాలు
గ్రేటర్‌లో రూ.వేల కోట్ల స్వాహా

రూ.4,336 కోట్లు.. మహా నగరం అడ్డాగా గతేడాది ఆర్థిక నేరగాళ్లు సామాన్యుల నుంచి కాజేసిన సొమ్ము. ఇది కేవలం పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిర్ధారించిన సొత్తు మాత్రమే. మాయగాళ్ల చేతిలో పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకోలేని బాధితులు వేలల్లో ఉంటారని అంచనా. కొద్దిపాటి పెట్టుబడితో అధిక లాభాలు, తక్కువ ధరకు విలువైన స్థలాలు, నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు.. ప్రతి అవకాశాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. చొక్కా నలగకుండా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలనే ఆశతో మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు. 2020లో రూ.500 కోట్ల మేర ఆర్థిక నేరాలు జరిగితే.. 2021నాటికి అది 10 రెట్లు పెరగటం పరిస్థితికి అద్దంపడుతోంది. సైబర్‌ నేరస్థులకు పోటీగా వైట్‌కాలర్‌ నేరగాళ్లు పెరగటం ఆందోళన చెందాల్సిన అంశమేనంటున్నారు పోలీసు అధికారులు.

ఎంతకైనా బరితెగింపు

ఉన్నత చదువులు.. సమాజంలో గౌరవం. మంచిచెడుల విచక్షణ తెలిసిన విద్యావంతులే ఆర్థిక నేరస్థులుగా మారుతున్నారు. అప్పులు చేసి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. అక్కడ నమ్మకం కుదిరాక భూములు, విలువైన ఆస్తులున్నాయంటూ ఫోర్జరీ సంతకాలతో నకిలీపత్రాలు సృష్టించి తనఖా ఉంచుతున్నారు.  బ్యాంకర్లు చివరికి మోసపోయినట్టు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రీ లాంచింగ్‌ పేరిట.. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే మధ్య తరగతి ఆశలే అవకాశంగా అందమైన ప్రకటనలతో నిండా ముంచుతున్నారు కొందరు. సొంత స్థలాల్లేకుండానే ఇళ్లు కడుతున్నామంటూ రూ.కోట్లు రాబడుతున్నారు. నకిలీ పత్రాలతోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ అంతా బోగస్‌ అని తెలిసినా చాలా మంది ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోతూనే ఉంటున్నారు.


దొరికితేనే దొంగలు

పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలే అవకాశంగా మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏటా సుమారు 1500-1800 ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.300 నుంచి స్థోమతకు తగినట్టుగా పెట్టుబడితో రాబడి ఇస్తామంటూ దేశ, విదేశీ సంస్థల పేర్లతో నేరస్థులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ముసుగులో దిల్లీ, ముంబై, హైదరాబాద్‌ నగరాలు కేంద్రంగా భారీఎత్తున మోసాలు జరుగుతున్నాయని సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు.


కొన్ని ఉదాహరణలు

ప్రముఖ వ్యాపార సంస్థకు ముగ్గురు డైరెక్టర్లు. ఇద్దరికి చెక్‌ పవర్‌ ఉంది. మరో డైరెక్టర్‌ రోజూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటాడు. ఖాతాదారులు కావడంతో ఆ బ్యాంకు మేనేజర్‌ కూడా చెక్‌లో రాసినంత నగదు ఇస్తుండేవారు. అసలు సంగతి ఏమిటంటే బ్యాంకు చెక్‌పై ఫోర్జరీ సంతకంతో మూడో వ్యక్తి ఏకంగా రూ.25లక్షలు కాజేశాడు. అంతర్గత ఆడిటింగ్‌లో విషయం బయటపడి పోలీసుల వరకు చేరింది.


* భవన నిర్మాణ సంస్థలు, బ్యాంకు రెండింటినీ ఏకకాలంలో మోసం చేసిన నలుగురిపై కేసు నమోదైంది. వీరంతా సమాజంలో గుర్తింపు ఉన్నవారు. విద్యావంతులు. వ్యాపార ముసుగులో జాతీయ బ్యాంకుకు నకిలీపత్రాలు అందజేసి రూ.53 కోట్లు రుణం పొందారు. వీరు తనఖా ఉంచిన పత్రాలపై ఫోర్జరీ సంతకాలను గుర్తించి బ్యాంకు మేనేజర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.


* ఇందూస్‌ వివ సంస్థ ఉత్పత్తులను అంటగడుతూ దేశవ్యాప్తంగా 9.5లక్షల మందిని మోసగించి రూ.1500కోట్లు కాజేసింది. ఈ మాయాజాలంలో 25 మంది భాగస్వామ్యం ఉన్నట్టు పోలీసులు దర్యాప్తులో నిర్దారించారు. బ్యాంకులోని రూ.20కోట్ల నగదు ఫ్రీజ్‌ చేశారు.


ముందుచూపుతో మాయగాళ్లకు చెక్‌

-దార కవిత, డీసీపీ, ఆర్థిక నేరాల విభాగం, సైబరాబాద్‌

వరికీ డబ్బులు ఊరకే రావని గుర్తించాలి. కొంత పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయనే ప్రకటనలు బోగస్‌ అని తెలుసుకోవాలి. పోస్టాఫీసు, జాతీయ బ్యాంకులు కూడా ఇవ్వలేని వడ్డీ బయటి సంస్థలు ఎలా ఇస్తాయనేది ఒక్కసారి ఆలోచించండి. ఖాతాదారులపై నమ్మకంతో బ్యాంకులు కూడా మోసగాళ్ల చేతిలో రూ.కోట్లు నష్టపోతున్నాయి. కాయకష్టం చేసి సంపాదించిన సొమ్మును పెట్టుబడి/ఇంటి నిర్మాణం/ఆస్తి కొనుగోలుకు వెచ్చించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. సంస్థలు చెబుతున్న మాటలు, చూపుతున్న పత్రాలు అసలా/నకిలీవా నిర్దారించుకోవాలి. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌, పెట్టుబడులు, ప్రీలాంచింగ్‌ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వచ్చినా, మోసపోయినట్టు గ్రహించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని