logo

వయోధికులకు యాప్‌న్న హస్తం

‘‘ఒంటరితనంతో బాధపడుతున్నా.. పిల్లలు విదేశాల్లో ఉంటున్నా.. వయోభారంతో ఇబ్బందులు పడుతున్నా.. చివరకు మీ సంతానం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నా.. ఎలాంటి అనుమానాల్లేకుండా మాతో మాట్లాడండి.. మీ కష్టాలు.. సుఖాలు మాతో పంచుకోండి’’

Published : 20 Jan 2022 05:13 IST
త్వరలో అందుబాటులోకి
తాత్కాలికంగా టోల్‌ఫ్రీ నంబరు 14567 ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌

‘‘ఒంటరితనంతో బాధపడుతున్నా.. పిల్లలు విదేశాల్లో ఉంటున్నా.. వయోభారంతో ఇబ్బందులు పడుతున్నా.. చివరకు మీ సంతానం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నా.. ఎలాంటి అనుమానాల్లేకుండా మాతో మాట్లాడండి.. మీ కష్టాలు.. సుఖాలు మాతో పంచుకోండి’’ అంటూ వయోధికులకు హైదరాబాద్‌ పోలీసులు సేవలందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వయోధికుల సంక్షేమానికి జిల్లాస్థాయి కమిటీని గత నెల ఏర్పాటు చేశారు. యాప్‌ అందుబాటులోకి వచ్చే వరకూ టోల్‌ఫ్రీ నంబర్‌ 14567కు ఫోన్‌ చేయాలని సూచించారు.

వైద్యారోగ్య అవసరాలు.. ఇతర సేవలు

నగరంలోని ప్రతి ఠాణా పరిధిలో ఎంతమంది వృద్ధులున్నారో తెలుసుకొనేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 5 లక్షల మంది ఉన్నారు. వీరిలో 30 వేల మందికిపైగా విశ్రాంత అధికారులు, వైద్యనిపుణులున్నారు. వారితో యాప్‌ గురించి చర్చించారు.

* యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వయోధికులు చిరునామా, కుటుంబసభ్యుల వివరాలు, వారికి అవసరమైన సేవలను ఐచ్ఛికాలుగా ఎంపిక చేసుకోవాలి. ఆమేరకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది.

* సొంతూళ్లకు వెళ్లేందుకు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లేవారు వివరాలు నమోదు చేస్తే బస్సు, రైలు, విమాన టిక్కెట్లు బుక్‌ చేయించనున్నారు.

* అంబులెన్స్‌ సేవలు, కార్పొరేటు ఆసుపత్రుల్లో అపాయింట్‌మెంట్ల సమాచారాన్ని అందించనున్నారు.

* అపార్ట్‌మెంట్లలో పనివాళ్లు, డ్రైవర్లు, వంటమనుషులను నియమించుకునేప్పుడు వారి నేరచరితపైనా వివరాలు అందజేయనున్నారు.  

సీనియర్‌ సిటిజన్లు సులభంగా యాప్‌ను వినియోగించేలా ఎలాంటి అంశాలుండాలన్న విషయంపై ఐటీ నిపుణులతో చర్చించారు. ఒంటరిగా ఉంటున్న వయోధికుల్లో భార్యభర్తలు, భాగస్వామి లేనివారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ యాప్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌ జిల్లా వయోధికుల సంక్షేమ కమిటీ సభ్యులు, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని