logo

ప్రత్యేక కార్యాచరణ.. రక్తహీనత నియంత్రణ

మహిళల్లో రక్తహీనతకు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక పోషకాలను అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆరోగ్యకరమైన అతివల సమాజాన్ని రూపొందించేందుకు కార్యాచరణ అమలులోకి రాబోతోంది. జాతీయ

Published : 21 Jan 2022 01:05 IST

గవర్నర్‌ చొరవతో పోషకాల కిట్‌కు సన్నాహాలు

కొనసాగుతున్న శిబిరాలు

బుద్ధారంలో పరీక్షలు చేస్తున్న సిబ్బంది

మహిళల్లో రక్తహీనతకు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక పోషకాలను అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆరోగ్యకరమైన అతివల సమాజాన్ని రూపొందించేందుకు కార్యాచరణ అమలులోకి రాబోతోంది. జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో అమలుకానున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై చొరవతో ఆర్థిక వనరులు సమకూరనున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మండలానికి ఒక గ్రామంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులను గుర్తించి కేసీఆర్‌ కిట్‌ తరహాలో ‘పోషకాల కిట్‌’ త్వరలో అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

జిల్లా వ్యాప్తంగా స్త్రీలు, పిల్లలు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని పూర్తి స్థాయిలో గుర్తించి అవసరమైన సహకారం అందించేందుకు గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అలాంటి వారికి పోషకాలను ఉచితంగా అందించాలని సంకల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తహీనత కలిగిన వారిని గుర్తించేందుకు భారత వైద్య పరిశోధన (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌), జాతీయ పోషకాల సంస్థ (నేషనల్‌ ఇనిస్టిస్ట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌)కు సూచించింది. ఈ సంస్థలు 2011లో నిర్వహించిన సర్వే అధారంగా అత్యధికంగా రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు వికారాబాద్‌లో ఉన్నారని గుర్తించారు. దీంతో జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. తొమ్మిది ఏళ్ల నుంచి 48 ఏళ్ల వయసున్న వారికి పరీక్షలు చేసి హిమోగ్లోబిన్‌ శాతాన్ని నమోదు చేస్తున్నారు.

ఏఏ మండలాల్లో: తాండూరు మండలం కోటబాస్పల్లి, పూడూరు మండలం కండ్లపల్లి, మోమిన్‌పేట మండలం అమ్రాదికలాన్‌, వికారాబాద్‌ పీరంపల్లి, పరిగి మాదారం, కుల్కచర్ల అంతారం, దోమ బొంపల్లి, కోట్‌పల్లి రాంపూర్‌, ధారూరు ధర్మాపూర్‌, పెద్దేముల్‌ బుద్ధారంలో శిబిరాలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 250 మందిని పరిశీలిస్తే 157మందిలో పదకొండు శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్‌ అంతకంటె తక్కువ ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగిలిన మండలాల్లోని గ్రామాల్లోనూ చేపడితే ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

శాశ్వత పరిష్కారానికి..

బాలికలు, యువతులు, మహిళల్లో ఈ సమస్యలకు కారణాలను సైతం అన్వేషించనున్నారు. పరీక్షల ప్రకారం పేరు, బరువు, ఎత్తు, ఆధార్‌, చరవాణి సంఖ్య వంటి వివరాలను నమోదు చేయనున్నారు. దీంతోపాటు గ్రామాల్లోని బోరు నీరు, భగీరథ జలాలు, శుద్ధి నీటి ప్లాంటు నీటి నమూనాలను సైతం సేకరిస్తున్నారు. వాటిని ల్యాబ్‌కు తరలించి ప్రయోగాల అనంతరం కారణాలను తేల్చనున్నారు. ఆయా గ్రామాలకు రెండుమూడు నెలల తర్వాత వచ్చి ప్రయోగాల ఫలితాలతోపాటు గ్రామస్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాల గురించి అవగాహన కల్పించనున్నారు.

త్వరలో సరఫరా: జిల్లావ్యాప్తంగా శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక, ఆయా గ్రామాల వారీగా జాబితా రూపొందించి బాలికలు, యువతులు, మహిళలకు పోషకాలతోకూడిన కిట్‌ను ఉచితంగా అందించనున్నారు. 25 రోజులకు ఒకసారి అందించే కిట్‌లో బాదాం, పిస్తా, సేంద్రియంగా తయారు చేసిన రాగి లడ్డూలు, బెల్లంతో చేసిన పల్లీపట్టీలు వంటివి ఇవ్వనున్నారు.

వివరాలు నమోదు చేస్తున్నాం: ప్రవీణ్‌కుమార్‌యాదవ్‌, జాతీయ పోషకాల సంస్థ ప్రతినిధి

గవర్నర్‌ చొరవతో రక్తహీనత కల్గిన వారిని గుర్తించి ప్రత్యేకంగా పోషకాల కిట్‌ను త్వరలో సరఫరా చేస్తాం. మండలానికి ఒక గ్రామంలో శిబిరం నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఈ సమస్యను అధిగమించడం ద్వారా బాలికలు, యువతులు, మహిళల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని