logo

ఉగాది నుంచి బాచుపల్లిలో.. తెలుగు వర్సిటీ తరగతులు

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని నగర శివారులోని బాచుపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉగాది రోజు నుంచి కొత్త ప్రాంగణంలో తరగతులు

Published : 21 Jan 2022 01:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని నగర శివారులోని బాచుపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉగాది రోజు నుంచి కొత్త ప్రాంగణంలో తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. దాదాపు రెండు దశాబ్దాల కిందట బాచుపల్లిలో వంద ఎకరాల స్థలాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించింది. నిధుల కొరత కారణంగా భవనాల నిర్మాణంలో జాప్యం, మౌలిక వసతులు లేకపోవడంతో వర్సిటీ తరలింపు ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. గతేడాది వర్సిటీ వీసీగా నియమితులైన ఆచార్య తంగెడ కిషన్‌రావు వర్సిటీ తరలింపుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బాచుపల్లి క్యాంపస్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. భవనాలను సైతం ఆధునికీకరిస్తున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరు హాస్టళ్లను సిద్ధం చేస్తున్నారు. ఉగాది నుంచి కొత్త క్యాంపస్‌లో తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వీసీ టి.కిషన్‌రావు వివరించారు. విశ్వవిద్యాలయం బాచుపల్లికి తరలిస్తే నాంపల్లి ప్రాంగణాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఉపకులపతి కిషన్‌రావు తోసిపుచ్చారు. నాంపల్లి క్యాంపస్‌ వర్సిటీ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. బాచుపల్లికి ఎంఏ తరగతులు మాత్రమే తరలిస్తున్నట్లు చెప్పారు. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు నాంపల్లిలోనే కొనసాగిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని