logo

ఉదయం చూసి.. రాత్రికి కన్నమేసి

ఇంటికి తాళం కనిపిస్తే చాలు.. లోపలికెళ్లి అందినకాడికి ఎత్తుకెళ్తున్న ఘరానా దొంగ చిదిరిక అరవింద్‌ను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

Updated : 21 Jan 2022 02:12 IST

రాజీవ్‌నగర్‌ చోరీ కేసులో ఘరానా దొంగ అరెస్టు

రూ.54.62 లక్షల సొత్తు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న సొత్తును చూపుతున్న సీపీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటికి తాళం కనిపిస్తే చాలు.. లోపలికెళ్లి అందినకాడికి ఎత్తుకెళ్తున్న ఘరానా దొంగ చిదిరిక అరవింద్‌ను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధి రాజీవ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఈనెల 13న జరిగిన చోరీలో 660 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.22లక్షల నగదు దొంగ పాలయింది. సీసీ ఫుటేజీలు, చోరీ జరిగిన తీరు ఆధారంగా ఇది అరవింద్‌ పనిగా పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. రూ.54.62లక్షల సొత్తు, రెండు బైకులు, ఐఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు

వరంగల్‌ జిల్లా నడికుడ గ్రామానికి చెందిన అరవింద్‌ అలియాస్‌ నాని ఇంటర్‌ చదివాడు. 2004లో తండ్రి చనిపోవడంతో మంచిర్యాలలో తల్లి వద్ద కొన్నేళ్లున్నాడు. 2015లో హైదరాబాద్‌కు వచ్చాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. 2017 నుంచి దొంగతనాలు చేయసాగాడు. మూడేళ్లలో నగరంలోని మూడు, వరంగల్‌, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో 27 దొంగతనాలు చేశాడు. ఎల్బీనగర్‌ పోలీసులు 2020 ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేసి జైలుకు పంపించగా, అదే ఏడాది బయటకొచ్చి బుద్ధిగా ఉంటానని చెప్పాడు.

కాపలాదారు..డెలివరీ బాయ్‌..ఫార్మసీ..అర్బన్‌ క్లాప్‌..

కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్‌లో కాపలాదారుడిగా చేరాడు. తర్వాత ఫుడ్‌ డెలివరీబాయ్‌గా, ఫార్మసీలోనూ చేసి మళ్లీ లోధా అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా వచ్చాడు. డబ్బు ఎక్కువగా వస్తుందని అర్బన్‌ క్లాప్‌ కంపెనీలో చేరాడు. ఆశించినంత రాకపోవడంతో మళ్లీ దొంగగా మారాడు. ఈనెల 12న రాజీవ్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు అర్బన్‌క్లాప్‌ కంపెనీ తరఫున మరమ్మతులకని వెళ్లాడు. తాళం వేసిన ఫ్లాట్‌ చూసి అర్ధరాత్రి వెళ్లి తాళం పగులగొట్టి సొత్తు పట్టుకెళ్లాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని