logo

నాడి అందని సర్వే

కరోనా కోరలు చాచిన వేళ వైరస్‌ లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సాయం అందించేందుకు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జ్వరం తదితర కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను ఇవ్వాలని

Published : 23 Jan 2022 03:09 IST

 చార్మినార్‌ జోన్‌లో వ్యాధి లక్షణాలున్న వారు సున్నాగా నివేదిక!
 శేరిలింగంపల్లి జోన్‌ లెక్కలపైనా విమర్శలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; ఈనాడు, హైదరాబాద్‌

సర్వేని పరిశీలిస్తున్న రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి

కరోనా కోరలు చాచిన వేళ వైరస్‌ లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సాయం అందించేందుకు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జ్వరం తదితర కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను ఇవ్వాలని బల్దియాని ఆదేశించింది. ఓవైపు జీహెచ్‌ఎంసీలో గరిష్ట స్థాయిలో కేసులు నమోదవుతున్నా, పాతబస్తీ పరిధిలో రెండు రోజుల్లో ఒక్కరూ జ్వరంతో బాధపడటం లేదంటూ లెక్కలు చూపడం సర్వే జరుగుతున్న తీరుకు అద్దం పట్టింది. పలు ఇతర జోన్లలోనూ తూతూమంత్రపు గణాంకాలే చూపుతుండడం విమర్శలకు తావిస్తోంది. చాలా మంది సిబ్బంది ఇళ్లకు వెళ్లకుండానే లెక్కలు రాసేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మాత్రం కాస్త బాగానే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో గ్రేటర్‌లో 2120 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

రాజధానిలో 120 కరోనా పరీక్ష కేంద్రాలు రోజూ వేలాది మంది అనుమానితులతో కిటకిటలాడుతున్నాయి. కిట్లు లేక అందరికీ పరీక్షలు చేయలేని పరిస్థితి. మహానగరంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట రాష్ట్రవ్యాప్తంగా సర్కార్‌ జ్వరం సర్వేను చేపట్టింది. గ్రేటర్‌ 500 మందికిపైగా బల్దియా దోమల నివారణ విభాగం సిబ్బంది, వందలాది మంది డ్వాక్రా మహిళలు, వైద్య సిబ్బంది సర్వేలో నిమగ్నమయ్యారు. ఇంటింటికి తిరిగి వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం, దగ్గర్లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించి మందుల కిట్లు అందించాలన్నది సర్వే ముఖ్యోద్దేశం. కొన్ని చోట్ల సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వేలో పాల్గొనకుండానే ఎవరికీ లక్షణాలు లేవని నివేదిక ఇస్తున్నారు. గణాంకాల్లో అంకెల గారడీ ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జోనల్‌ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, వాస్తవాలను నివేదిస్తే కొవిడ్‌ కట్టడికి తమపై అధిక ఒత్తిడి పెడతారన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. చార్మినార్‌ జోన్‌ మొత్తం మీద శుక్ర, శనివారాల్లో చేపట్టిన పరిశీలనలో ఏ ఒక్కరిలోనూ అనుమానిత లక్షణాల్లేవని పేర్కొనడమే అందుకు నిదర్శనం. 15 లక్షల మంది జనాభా ఉండే శేరిలింగంపల్లి జోన్‌లో కేవలం 20 మందికే కరోనా సూచనలున్నట్లు లెక్కచెప్పారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని కరోనా పరీక్ష కేంద్రాలు కిటకిటలాడుతుండడం గమనార్హం.


60 వేల ఇళ్లు పూర్తి

48 గంటల్లో బల్దియా పరిధిలో 60 వేల ఇళ్లను పరిశీలించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌ జోన్లలో ఎక్కువ మందికి వ్యాధి లక్షణాలున్నట్లు పేర్కొన్నారు. సర్వేను ఆరు రోజుల్లో ముగించాలని సర్కారు ఆదేశించింది. ఆ లోగా ముగించడం కష్టమని మరిన్ని రోజులు పొడిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు.


రంగారెడ్డి జిల్లాలో 1208 మందిలో..

రంగారెడ్డి జిల్లా వైద్య అధికారులు గణాంకాల ప్రకారం.. రెండు రోజుల్లో 51,338 ఇళ్లలో సర్వే చేశారు. 1208 మంది కరోనా లక్షణాలతో బాధపడుతుండగా వారందరికీ కిట్లను అందజేశారు.
* మేడ్చల్‌ జిల్లాలో 74,126 ఇళ్లను పరిశీలించగా 4,249 మందిలో లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లను అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని