logo

స్వచ్ఛ సాగర్‌ సాకారమయ్యేలా!

నగరంలో ఒక్కసారి అలా సరదాగా చుట్టి రావాలని అనిపించే ప్రాంతాల్లో ట్యాంక్‌బండ్‌.. నెక్లెస్‌ రోడ్డు ప్రధానమైనవి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం ఈ ప్రాంతాలను చూసే తిరిగి వెళుతుంటారు. నగరవాసులు సాయంత్రమైతే... స్నేహితులతో

Published : 24 Jan 2022 01:43 IST

నీటి నుంచి వాసన రాకుండా చర్యలు
త్వరలో బయో రెమిడేషన్‌ ప్రక్రియ
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఒక్కసారి అలా సరదాగా చుట్టి రావాలని అనిపించే ప్రాంతాల్లో ట్యాంక్‌బండ్‌.. నెక్లెస్‌ రోడ్డు ప్రధానమైనవి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం ఈ ప్రాంతాలను చూసే తిరిగి వెళుతుంటారు. నగరవాసులు సాయంత్రమైతే... స్నేహితులతో చిట్‌చాట్‌.. కుటుంబాలతో ఆహ్లాదకరంగా గడిపేందుకు ఈ ప్రాంతాలకు వస్తుంటారు. సాధారణ రోజుల్లో ఎలా ఉన్నా, వేసవిలో మాత్రం ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు వద్ద కాసేపు ఉండాలంటే ఇబ్బందే. తీవ్రమైన ఎండల కారణంగా సాగర్‌లో రసాయన చర్య జరిగి విపరీతమైన ఆల్గే(నాచు) పేరుకుపోతోంది. నెట్రోజన్‌, పాస్పరస్‌లు భారీగా పెరిగి జలాల నుంచి తీవ్రమైన దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. ఆ సమయంలో పరిసరాల్లోకి వెళ్లాలంటే జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని నివారణకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) బయో రెమిడేషన్‌ చికిత్స చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అంతర్జాతీయ స్థాయిలో ఇటీవలే టెండర్లు పిలిచింది.

దుర్గంధం  లేకుండా..
వేసవిలో భారీ ఎత్తున పెరిగే ఆల్గేను నియంత్రించి చెరువు నుంచి దుర్వాసన రాకుండా బయో రెమిడేషన్‌ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. తొలుత ఎక్కడెక్కడ ఎక్కువ ఆల్గే ఉందో అక్కడ ఏరోబిక్‌ బ్యాక్టీరియాను ఉపయోగించి పెరగకుండా చూస్తారు. మార్చి నుంచి.. మళ్లీ వానలు కురిసే వరకు నిరంతరాయంగా ఈ ప్రక్రియ సాగుతుంది. 4.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన సాగర్‌ క్యాచ్‌మెంట్‌ పరిధి దాదాపు 240 చదరపు కిలోమీటర్లు. ప్రధానంగా నాలుగు నాలాలు అనుసంధానమై ఉన్నాయి. ఒకప్పుడు వర్షపు నీరు మాత్రమే వీటి ద్వారా చేరేది. నగరంలో పారిశ్రామికీకరణ, పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు రావడంతో రసాయన వ్యర్థాలు, ఇతర మురుగు అంతా నాలాల ద్వారా సాగర్‌లో చేరుతోంది. తర్వాత జలాలు విషతుల్యంగా మారాయి. విపరీతమైన దుర్గంధం వెదజల్లేది. గతంలో రూ.370 కోట్లు ఖర్చుచేసి నాలాల మళ్లింపుతో పాటు సాగర్‌లో వ్యర్థాలను కొంతవరకు తొలగించారు. తరువాతా నీటిలో కరిగిన ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువే ఉంటున్నాయి. బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ) భారీ ఎత్తున నమోదవుతోంది. ఫలితంగా వేసవిలో భారీ ఎత్తున ఆల్గే పెరిగి నీళ్లు పచ్చరంగులోకి మారి వాసన వస్తోంది. త్వరలో చేపట్టే ప్రక్రియ ద్వారా నీటిలో కరిగిన ఆక్సిజన్‌ స్థాయిలు ఒక లీటర్‌కు 4 ఎంజీల కంటే పెంచడంతో పాటు బీవోడీ 30-36 ఎంజీలు ఉండేలా చర్యలు తీసుకోవటానికి వీలవుతుందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని