logo

ఎరుపెక్కిన తుర్కయాంజాల్‌.. ఏకమైన సీపీఎం శ్రేణులు

సీపీఎం తృతీయ రాష్ట్ర మహాసభలు ఆదివారం నగర శివారులోని తుర్కయాంజాల్‌ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు(ఈ నెల 22న) ఆన్‌లైన్‌లో సభను ప్రారంభించగా.. రెండోరోజు తుర్కయాంజాల్‌లోని

Published : 24 Jan 2022 01:42 IST

అట్టహాసంగా పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

సీపీఎం జెండా ఆవిష్కరణలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు

తుర్కయాంజాల్‌, న్యూస్‌టుడే: సీపీఎం తృతీయ రాష్ట్ర మహాసభలు ఆదివారం నగర శివారులోని తుర్కయాంజాల్‌ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు(ఈ నెల 22న) ఆన్‌లైన్‌లో సభను ప్రారంభించగా.. రెండోరోజు తుర్కయాంజాల్‌లోని ఎస్‌ఎస్‌ఆర్‌ కల్యాణమండపంలో అమరవీరుల స్తూపం వద్ద ఆ పార్టీ సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి జెండావిష్కరణ చేసి సభను ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు తరలివచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేస్తూ ప్రతినిధులను లోపలికి అనుమతించారు. రాష్ట్ర మహాసభల నేపథ్యంలో నాగార్జునసాగర్‌ రేడియల్‌ రహదారి(ఎగ్జిట్‌ 12), అటు బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి బొంగుళూరు జంక్షన్‌ వరకు ఎర్రటి తోరణాలతో అలంకరించారు. సభకు హాజరయ్యే ప్రతినిధుల విడిది కోసం తుర్కయాంజాల్‌ పట్టణంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జాతీయ ప్రతినిధుల బసకు వీలుగా స్థానిక తులిప్స్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణంలో నవతెలంగాణ పబ్లిషర్స్‌ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేశారు. ప్రవేశ ద్వారం వద్ద.. ప్రజాఉద్యమంలో అసువులుబాసిన కమ్యూనిస్టు చరిత్రకారుల సందేశాలతో కూడిన చిత్రపటాలను ఆకర్షణీయంగా ఏర్పాటుచేశారు.  ఆ పార్టీ గాయకుడు నర్సింహ పాడిన గీతాలు శ్రేణులను ఉత్తేజపరిచాయి. కళాబృందాల ఆటపాటలూ ఆకట్టుకున్నాయి. సీపీఎం మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజా బొజ్జి, మస్కు నర్సింహ మృతికి సంతాపంగా సభలో మౌనం పాటించి వారి సేవలను స్మరించుకున్నారు. సీనియర్‌ నేత చెరుపల్లి సీతారాములు అధ్యక్షత వహించగా, అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాజకీయ తీర్మానం, నాయకురాలు హైమవతి సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని