logo

TS News: అర్ధాంగి అదృశ్యమైందని భర్త.. ఆయన్నుంచి కాపాడాలని భార్య

భార్య అదృశ్యమైందని భర్త పోలీసులను ఆశ్రయించగా, భర్త నుంచి రక్షణ కల్పించాలని భార్య వేడుకోవడం చర్చనీయాంశమైంది. సైదాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఐఎస్‌ సదన్‌

Updated : 24 Jan 2022 08:50 IST

పోలీసులను ఆశ్రయించిన నీటిపారుదల శాఖ ఉన్నతోద్యోగి దంపతులు

సైదాబాద్‌, న్యూస్‌టుడే: భార్య అదృశ్యమైందని భర్త పోలీసులను ఆశ్రయించగా, భర్త నుంచి రక్షణ కల్పించాలని భార్య వేడుకోవడం చర్చనీయాంశమైంది. సైదాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సరస్వతీనగర్‌ కాలనీలో ఉండే కొర్ర ధర్మనాయక్‌(54) నాగార్జునసాగర్‌లో ఇరిగేషన్‌ విభాగంలో ఉన్నతోద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య పద్మజ(47) మానసిక రోగి అని, శనివారం అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన చరవాణి ఇంట్లో వదిలి, 50 తులాల బంగారం, రూ.50 వేలు, బ్యాంక్‌ లాకర్‌ తాళం తీసుకెళ్లిందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలాఉంటే తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందని, ఆదివారం పద్మజ నగర పోలీసు అధికారులను సామాజిక మాధ్యమాల్లో వేడుకుంది. అక్బర్‌బాగ్‌లోని బంధువుల నివాసంలో ఆమె మాట్లాడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తన భర్త నాగార్జునసాగర్‌ ఎస్‌ఈగా పని చేస్తున్నారని, 2008లో తమ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసిందని ఆ సమయంలో తన పేరున రాసిన ఆస్తులు తిరిగి బదలాయించాలని తరచూ వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈనెల 4న భర్త, ఆయన తల్లి, సహచరులు బలవంతంగా తనకు విషం తాగించారని, ఆసుపత్రిలో నాలుగు సర్జరీలు జరిగాయని చెప్పింది. తనపై హత్యాయత్నం జరిగిన విషయాన్ని సైదాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఓ గదిలో తనను బంధించగా.. అక్కడి నుంచి తప్పించుకున్నానంటూ రోదించింది. ఆస్తులు బదలాయించినా, తనకు ప్రాణానికి హాని ఉందని వాపోయారు. నగర పోలీసు అధికారులు న్యాయం చేయాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని