logo

ఆధ్యాత్మికత భారత్‌కు ఆత్మ

‘ఆధ్యాత్మికత’ భారతదేశానికి ఆత్మవంటిదని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. జన్‌ ఉర్జా మంచ్‌ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను ‘ఉద్ఘోష్‌’ పేరిట నగరంలోని బీఎం బిర్లా సైన్స్‌

Published : 24 Jan 2022 01:42 IST

నేతాజీ జయంత్యుత్సవాల్లో హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ

ప్రసంగిస్తున్న చిన జీయర్‌స్వామి. చిత్రంలో గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘ఆధ్యాత్మికత’ భారతదేశానికి ఆత్మవంటిదని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. జన్‌ ఉర్జా మంచ్‌ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను ‘ఉద్ఘోష్‌’ పేరిట నగరంలోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని భాస్కరా ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి దత్తాత్రేయ ప్రసంగిస్తూ.. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండటానికి గొప్ప సైనిక శక్తిని తయారు చేసుకోవాలని, సూపర్‌ పవర్‌ దేశాల సరసన భారత్‌ను నిలబెట్టడమే నేతాజీకి మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఆనాడు నేతాజీ, నేడు ప్రధాని మోదీ చేస్తోంది దేశాన్ని ‘ఆత్మనిర్భర్‌ భారత్‌గా’ తీర్చిదిద్దే ప్రయత్నమే అన్నారు. రాష్ట్ర మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. యువత నిజాయతీ, ప్రేమతో దేశభక్తిని పెంపొందించుకుని, దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సైతం సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణలో యాదాద్రి, శంషాబాద్‌లోని సమతామూర్తి పుణ్యక్షేత్రాలు దేశసంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉన్నాయన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి ప్రసంగిస్తూ.. ఏ ఆశయం, లక్ష్యం కోసమైతే నేతాజీ తన సర్వస్వాన్ని త్యాగం చేశారో.. ఆ ఫలాలు మనమంతా ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. దేశం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించినవారిని స్మరించుకున్నప్పుడే మనలో నూతనోత్తేజం కలుగుతుందన్నారు. అనంతరం దేశ, సమాజ సేవ చేస్తున్న పలువురిని సత్కరించారు. నిర్వాహకులు మనీష్‌ అగర్వాల్‌, డా.నిషితా, భాజపా మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి పాల్గొన్నారు. రాయ్‌ చౌదరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని