logo

కూతురికి వెలకట్టిన అమ్మ

కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కన్నతల్లి కూతుర్ని విక్రయించేందుకు సిద్ధమైంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు రూ.5 లక్షలకు వెలకట్టింది.

Published : 25 Jan 2022 06:47 IST

తల్లి, అమ్మమ్మ సహా 9 మంది అరెస్ట్‌

బాలికల దినోత్సవం రోజున వెలుగు చూసిన ఘటన

ఈనాడు, హైదరాబాద్‌ - పహడీషరీఫ్‌, న్యూస్‌టుడే: కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కన్నతల్లి కూతుర్ని విక్రయించేందుకు సిద్ధమైంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు రూ.5 లక్షలకు వెలకట్టింది. తాత వయసుగల వయోధికుడి వెంట పంపాలనుకుంది. రాచకొండ పోలీసుల రంగప్రవేశంతో బాలిక ప్రమాదం నుంచి తప్పించుకుంది. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆధ్వర్యంలో షీ టీమ్స్‌ డీసీపీ షేక్‌ సలీమా, వనస్థలిపురం ఏసీపీ కె.పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ బి.భాస్కర్‌, పి.నాగరాజు బృందం పక్కా ప్రణాళికతో బాలాపూర్‌ మండలం ఎర్రకుంటలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితులు సయ్యద్‌ అల్తాఫ్‌(61), అఖిల్‌ అహ్మద్‌(37), జరీనా బేగం(25); షబానా బేగం(25), షమీన్‌ సుల్తానా(45), నస్రీన్‌ బేగం(40), జహైద్‌బీ(72), బాలిక తల్లి (37), అమ్మమ్మ (65)లను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. వారి నుంచి 10 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాలికల దినోత్సవం రోజు వెలుగుచూసిన ఆడపిల్ల విక్రయం వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయికి చెందిన సయ్యద్‌ అల్తాఫ్‌ ట్రావెలింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల కిందట బార్యకు విడాకులిచ్చిన ఇతడు మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 3 నెలల క్రితమే హైదరాబాద్‌లోని దళారులతో సంప్రదింపులు ప్రారంభించాడు. పెళ్లి కోసం అమ్మాయిని చూపించాలంటూ ఆటోడ్రైవర్‌ అఖిల్‌ అహ్మద్‌ను ఆశ్రయించాడు. ఇతడి ద్వారా జరీనా బేగం, షబానా బేగం రంగంలోకి దిగారు. బండ్లగూడకు చెందిన బాలిక(14) తల్లి, అమ్మమ్మలతో దళారులు రాయబేరాలు ప్రారంభించారు. రూ.5లక్షలకు ఆడపిల్లను విక్రయించేందుకు ఒప్పందం కుదిరినా వాటాల పంపిణీలో గొడవలు రావటంతో అల్తాఫ్‌ వెనక్కి వెళ్లిపోయాడు. తరువాత రూ.3లక్షలకు బాలికను కొనుగోలు చేసేందుకు ముంబయి వ్యాపారి సిద్ధమయ్యాడు. సోమవారం సాయంత్రం రూ.3లక్షలు తీసుకుని నిందితులు 9 మంది బాలాపూర్‌ మండలం ఎర్రకుంటలోని హబీబ్‌ ఫంక్షన్‌హాలు సమీపంలోని జరీనాబేగం ఇంటికి చేరారు. ఈ సమాచారంతో సీపీ మహేశ్‌భగవత్‌ క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదనపు సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ పర్యవేక్షణలో బాలాపూర్‌ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని