logo

ఇంట్లో దాచిన ఆక్సిజన్‌ సిలిండర్లు పేలి.. భవనం ధ్వంసం.. మహిళకు గాయాలు

ఆక్సిజన్‌ సిలిండర్లు పేలడంతో జీ+2 భవనం ధ్వంసమైంది. ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన పాతబస్తీలోని మొఘల్‌పురా ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ కథనం ప్రకారం..

Published : 25 Jan 2022 02:07 IST


ధ్వంసమైన భవనం

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: ఆక్సిజన్‌ సిలిండర్లు పేలడంతో జీ+2 భవనం ధ్వంసమైంది. ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన పాతబస్తీలోని మొఘల్‌పురా ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ కథనం ప్రకారం.. చందూలాల్‌ బేలాకాలనీలోని బ్లాక్‌ నంబరు 10, జీ+2 భవనంలో మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌ నిర్వహించే అనురాగ్‌ సక్సేనా(50) సహా ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.15గంటలకు భవనం నుంచి పొగలు వెలువడ్డాయి. ఐదు నిమిషాల వ్యవధితో రెండుసార్లు భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. స్థానికులు ఉలిక్కి పడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. భవనం మెట్లు, రెండు స్లాబ్‌లు ధ్వంసమయ్యాయి. ఇంటి గేటు 20మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఓ ద్విచక్ర వాహనం, రెండు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. సమీప ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. స్థానికుల సమాచారంతో మొఘల్‌పురా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చి అరగంట శ్రమించి మంటలు ఆర్పివేశారు. ఘటనలో పూనమ్‌గుప్తా(52)కు స్వల్పగాయాలయ్యాయి. ఇంట్లో నిల్వఉంచిన రెండు ఆక్సిజన్‌ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

భవనంలో ఓ పోర్షన్‌లో ఉండే అనురాగ్‌ సక్సేనా తన తల్లి ఆరోగ్యం బాగాలేక పోవడంతో కొవిడ్‌ వేళ ముందుజాగ్రత్తగా రెండు సిలిండర్లు తీసుకువచ్చి పెట్టాడు. పక్కనే ఇన్వెర్టర్‌ ఉండడంతో షార్ట్‌సర్క్యూట్‌ అయి సిలిండర్లు పేలినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని